ఎంపీ Vs మాజీ ఎమ్మెల్యే.. నడిగడ్డ 'హస్తం'లో ఆధిపత్య పోరు!

by Jakkula.Mamatha |

జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు తారాస్థాయికి చేరింది.

ఎంపీ Vs మాజీ ఎమ్మెల్యే.. నడిగడ్డ హస్తంలో ఆధిపత్య పోరు!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, నడిగడ్డ రాజకీయాల్లో గ్రూపు రాజకీయాలు చల్లారటం లేదు. ఒకవైపు అలంపూర్‌లో ఎంపీ డాక్టర్ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య 'కోల్డ్ వార్' నడుస్తుండగా, మరోవైపు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత తిరుపతయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు ఈ విభేదాలను మరింత రచ్చకెక్కించాయి. అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.

అలంపూర్‌లో సెగలు పుట్టిస్తున్న 'ఎక్స్ అఫీషియో' ఓటు!

అలంపూర్ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్, ఐజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజార్చుకోవడం పార్టీలో కలకలం రేపింది. ముఖ్యంగా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సమాన స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీ మల్లు రవి తన ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకుని ఉంటే మున్సిపల్ పీఠం హస్తగతం అయ్యేదని సంపత్ కుమార్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. "ఆమనగల్‌లో ఒక్క సీటు వచ్చినా పట్టుబట్టి అధికారం దక్కించుకున్న ఎంపీ, ఐదు సీట్లున్న అలంపూర్‌ను ఎందుకు పట్టించుకోలేదు?" అన్న సంపత్ ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గద్వాలలో బండ్ల 'చతురత'.. సరిత 'సైలెన్స్'!

గద్వాల నియోజకవర్గంలో పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంతకాలం ఆచితూచి అడుగులు వేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. పార్టీ బి-ఫామ్స్ అన్నీ తన వర్గానికే దక్కించుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. తామే కీలకం అవుతామని భావించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య దంపతులకు ఈ పరిణామం గట్టి షాక్ ఇచ్చింది. 37 వార్డుల్లో తమ వర్గానికి కనీసం 10 సీట్లు వస్తాయని ఆశించినా, ఎమ్మెల్యే పట్టు సాధించడంతో వారు ప్రస్తుతం మౌన ముద్రలోకి వెళ్లారు.

అధిష్టానం తీరుపై అసహనం..

జిల్లాలో ఇంత జరుగుతున్నా రాష్ట్ర స్థాయి నాయకత్వం గానీ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు గానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఒకరు వెళ్లే కార్యక్రమానికి మరొకరు రాకపోవడం, వచ్చినా మొక్కుబడిగా పలకరించుకోవడం వంటి దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా ఈ విభేదాలు సర్దుమణుగుతాయా? లేక మరింత ముదురుతాయా? అన్నది వేచి చూడాలి.

Next Story