- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కదలిక
తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించి, ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సోమశిల కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మళ్లీ కదలిక ఆరంభం అయ్యింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/కొల్లాపూర్: తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించి, ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సోమశిల కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మళ్లీ కదలిక ఆరంభం అయ్యింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య కృష్ణానది ఉండడం వల్ల ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రజలు రాకపోకలు సాగించాలంటే చిన్నచిన్న పడవల ద్వారా సాగించాల్సి ఉంది. అలా సాధ్యం కానీ ఎడల అచ్చంపేట, కొల్లాపూర్, నియోజకవర్గాల ప్రజలు మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల మీదుగా బయలుదేరి కర్నూలు మీదుగా వారి వారి గమ్య స్థానాలను చేరాల్సి ఉంటుంది. బీదలు, అత్యవసర పనులు ఉన్నవాళ్లు చిన్నచిన్న పడవల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో లెక్కకు మించిన ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పలుమార్లు ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 167 వ జాతీయ రహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టిన విషయం పాఠకులకు విధితమే.
కల్వకుర్తి సమీపంలోని కొట్ర గ్రామం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టి నిధులు మంజూరు చేసింది. సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సులభంగా రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇందుకోసం మొత్తం120 కిలోమీటర్ల పొడవున నిర్మించే 167వ జాతీయ రహదారికి , బ్రిడ్జి నిర్మాణానికి కలిపి కేంద్ర ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపుగా 3000 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడు సంవత్సరాల క్రితమే రోడ్డు పనులు ప్రారంభమై ఇంకా కొనసాగుతుండగా.. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ తదితర విభాగాలకు సంబంధించిన అనుమతులు రాకపోవడంతో.. పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచినప్పటికిని పలు రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావించి టెండర్లు వేయలేదని తెలిసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జి అంశం పై చర్చించి వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టెండర్లు వేసే గడువును పెంచడంతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అనంతరాలను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణం అవుతున్న 167వ జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 120 కిలోమీటర్ల పొడవున సాగవలసిన రోడ్డు పనులు తెలంగాణ రాష్ట్రంలో కొట్ర గ్రామం నుంచి కొల్లాపూర్ వరకు 86 కిలోమీటర్ల పొడవునా సాగుతున్నాయి. అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 34 కిలోమీటర్ల పొడవున సాగవలసిన రోడ్డు కోసం అవసరమైన స్థల సేకరణ జరుగుతుందని సమాచారం. త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసి టెండర్లు వేసి పనులు చేపట్టనున్నట్లు సమాచారం.
ఒక కిలోమీటర్ పొడవునా బ్రిడ్జి
సోమశిల వద్ద కృష్ణానదిపై ఒక కిలోమీటర్ పొడవున సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం కానుంది. ఈ బ్రిడ్జి పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించడంతో పాటు.. ప్రకృతి ప్రేమికులు ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానది జలదృశ్యాలు ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి అవకాశాలు ఉంటాయి. మూడు సంవత్సరాల తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






