Mahabubnagar: ప్రభుత్వ పథకాల జాతర షురూ..!

by Ramesh Goud |

పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే జాతర మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాలలో జరిగింది.

Mahabubnagar: ప్రభుత్వ పథకాల జాతర షురూ..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే జాతర మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాలలో జరిగింది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సభలు ఉదయం నుంచి సాయంత్రం వరకూజరిగాయి. పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు నిర్ణీత సమయానికి ఆయా గ్రామాలకు, పట్టణాలలోని వార్డులకు చేరుకుని సభలు నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంశాలకు సంబంధించి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.

రైతు భరోసా, రేషన్ కార్డులపై అభ్యంతరాలు..

అధికారులు ఇప్పటికే ఉన్న రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించి జాబితాలను బహిర్గతం చేయడంతో సాగులో లేని భూములు, వెంచర్లు, ఇప్పటికే పలు కారణాలతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు, కొండలు, గుట్టలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అధికారులు అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకొని.. మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జనానికి అవకాశాలు రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. పలుౌ కారణాలతో గ్రామసభలకు హాజరు కాని వారికి ఎంపీడీవో కార్యాలయాల్లో ఉన్న ప్రజా పాలనా సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనితో గ్రామసభలలో దరఖాస్తు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి ఈ నిర్ణయం పలువురికి మేలు కలిగించనుంది.

సందడే.. సందడి..

గ్రామసభల సందర్భంగా.. ఆయా వార్డులు... గ్రామాలలో సందడి నెలకొంది. దూర ప్రాంతాలలో ఉన్న ప్రజలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమ సొంత ఊర్లకు రావడం. అటునుండి సభలకు హాజరు కావడంతో కార్యక్రమాలు జరిగే గ్రామాలు.. పట్టణాల వార్డులలో సందడి నెలకొంది. మరికొన్ని గ్రామాలలో సభల కోసం జనం ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తం పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కోసం జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది.

Next Story