అట్ట‌డుగు వ‌ర్గాల వారికి నాణ్య‌మైన విద్య‌, వైద్యం అందాలి : గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ

by Ratna Kumari |

అట్ట‌డుగు వ‌ర్గాల వారికి నాణ్య‌మైన విద్య‌, వైద్యం అందాలి : గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ
X

దిశ, వనపర్తి : అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందినప్పుడే బలమైన సమాజం, దేశం నిర్మాణం సాధ్యమ‌వుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య సాదర స్వాగతం పలికారు. కలెక్టరేట్ ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్, ఆ వెంటనే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్, విద్యార్థుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో గ‌వ‌ర్నర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని సూచించారు. బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అప్పుడే సమాజం పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకుంటుందని తెలిపారు.

క్షయరహిత సమాజాన్ని నిర్మించాలన్నా, బాల్యవివాహాలను నిర్మూలించాలన్నా కవులు, కళాకారులు, రచయితల గళం ఎంతో కీలకమన్నారు. వీరంతా సమాజంలో భాగస్వాములై తమ గళాన్ని వినిపించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ప్రత్యక్షంగా పరస్పర మానవ సంబంధాలతోనే సమాజంలో సాధికారత సాధ్యమవుతుందని తెలియజేశారు. వనపర్తి జిల్లాలో క్షయ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం హెల్త్ యాప్ ని సృష్టించడం చాలా అద్భుతమని గవర్నర్ కొనియాడారు. కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కను నాటారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్, ఎస్.పి.డి. సునీత పాల్గొన్నారు.

Next Story