- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొంగు బంగారుడు " శివనారాయణ స్వామి "
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల ఇష్ట దైవంగా పూజలందుకుంటున్న శ్రీ బాలయోగి శివ నారాయణ స్వామి జాతర మహోత్సవం నారాయణపురం గ్రామంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

దిశ, మానవపాడు : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల ఇష్ట దైవంగా పూజలందుకుంటున్న శ్రీ బాలయోగి శివ నారాయణ స్వామి జాతర మహోత్సవం నారాయణపురం గ్రామంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో గ్రామం భక్తజన సంద్రమైంది. సత్యనారాయణ స్వామి కళ్యాణం: ఉత్సవాల్లో భాగంగా ముందుగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి పునీతులయ్యారు. సమాధి ఆలయ సందర్శన: బాలయోగి శివ నారాయణ స్వామి వారి సమాధిపై నిర్మించిన అత్యంత పవిత్రమైన ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప, దీప, నైవేద్యాలతో స్వామివారిని కొలిచారు.
ఈ జాతరకు ప్రతి ఏటా మహిళా భక్తులు భారీ సంఖ్యలో రావడం విశేషం. తమ కుటుంబ క్షేమం కోసం, సంతాన ప్రాప్తి కోసం మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. నారాయణపురం గ్రామంలో వెలసిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శివ నారాయణ స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, ఆపదలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా జాతర సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, భజన కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, వసతి సౌకర్యాలను కల్పించారు. పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. భక్తి భావంతో పులకించిన నారాయణపురం వీధులన్నీ స్వామివారి నామస్మరణతో మారుమోగాయి. రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం రంగ వైభవంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
85 ఏళ్లు బాలయోగిగానే భక్తులకు దర్శనం : రఘుత్తమాచార్య సాధు మహారాజ్
బాలయోగి శివ నారాయణ స్వామి 85 ఏళ్లుగా భక్తులకు దర్శనమిస్తూ కోరికలు నెరవేర్చే కొంగు బంగారంలా నారాయణపురంలో కొలువు తీయడం చాలా విశిష్టత కలిగి ఉందని శ్రీశ్రీశ్రీ రఘుత్తమాచార్య సాధు మహారాజ్ అన్నారు. జాతర మహోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. నరుడే నారాయనుడు అనే భావన తెచ్చిన ఏకైక మహా వ్యక్తి శ్రీ బాలయోగి శివ నారాయణ స్వామి అని వారి సేవలను భక్తులకు తెలిపారు. ఈరోజు బాలయోగి శివ నారాయణస్వామి మన మధ్యలో లేకపోయినా వారు చెప్పిన సందేశాలు, కీర్తనలు, వారి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా అందించుటకు ఆయన సమాధి ప్రత్యక్ష దైవమన్నారు. భక్తులు భారీ ఎత్తున వచ్చి బాలయోగి శివ నారాయణ స్వామి దర్శించుకోవడం అద్భుతమని ఆయన కొనియాడారు.






