తుంగభద్ర బ్యారేజ్​ భద్రమేనా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-02 03:16:26  IST  )

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న చారిత్రాత్మక తుంగభద్ర (సుంకేసుల) బ్యారేజ్ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తుంగభద్ర బ్యారేజ్​ భద్రమేనా?
X

దిశ, రాజోలి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న చారిత్రాత్మక తుంగభద్ర (సుంకేసుల) బ్యారేజ్ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో బ్యారేజీ గేట్ల పరిస్థితి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రాకపోకలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. 30వ గేట్ రూఫ్‌లు తెగిపడి ఉండగా, 29వ గేటు ఒకవైపు ఒకే రూఫ్‌ను కలిగి ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

పర్యవేక్షణ లోపం - గత అనుభవాలు మరువరాదా?

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరద నీరు భారీగా చేరుతోంది. అయితే, వర్షాకాలానికి ముందే అధికారులు డ్యాం పర్యవేక్షణ పనులు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2009 వరదల సమయంలో డ్యాం గేట్లు సరిగా పనిచేయక మొరాయించడంతో అప్పట్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ టిప్పర్లతో ప్రమాదానికి ఆహ్వానం

డ్యామ్‌పైకి భారీ లోడు కలిగిన టిప్పర్లను, ఇతర వాహనాలను ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించడం భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది. గరిష్ట లోడుకు మించి వాహనాలను అనుమతించడం భద్రతా, నిర్మాణ లోపాలను తీవ్రంగా ప్రభావితం చేసి, భవిష్యత్తులో పెద్ద విపత్తులకు దారితీసే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కేవలం తూతూ మంత్రంగానే తనిఖీలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సందర్శకుల భద్రత గాలిలో దీపం.. నిధులపై అనుమానాలు

సెలవు దినాల్లో తుంగభద్ర బ్యారేజ్ అందాలను వీక్షించడానికి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. కానీ, వారి భద్రతకు శాశ్వత చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శాశ్వత కంచెలను ఏర్పాటు చేయకుండా తాళ్ళతో, ముళ్ల కంచెలతోనే సరిపెడుతున్న వైనం సందర్శకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతేకాకుండా, డ్యాం రోడ్డుపై మట్టి పేరుకుపోవడం, వర్షం వచ్చినప్పుడల్లా నీరు నిలవడం, వర్షాకాలానికి ముందే శుభ్రం చేయకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. డ్యాం పర్యవేక్షణ పనుల కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయా లేదా, ఒకవేళ కేటాయించినా ఆ నిధులు ఏమవుతున్నాయనే అనుమానాలు ప్రజలలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్నాయి.

అధికారుల మొక్కుబడి సమాధానం..

ఈ విషయాలపై అధికారులను సంప్రదించగా, "డ్యాం గేట్ రూఫ్‌లు తెగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, వరద నీరు తక్కువగా ఉన్నందున మరమ్మతులు జరుగుతున్నాయని" మొక్కుబడి సమాధానం ఇచ్చారు. ఈ నిర్లక్ష్య వైఖరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు, స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Next Story