- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరా మహిళా శక్తి నిధుల్లో భారీ గోల్‌మాల్ !
గడిచిన కొన్నేళ్లుగా మండల మహిళా సమాఖ్య ఆడిట్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా అమలు చేస్తున్న ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. పేద మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం కేటాయించిన కోట్ల రూపాయల నిధులను మండల సమాఖ్య అధ్యక్షురాలు, అకౌంటెంట్ కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా అవకతవకలు జరిగినట్లు రుజువై రికవరీ చేసినా, అక్రమార్కుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ అండదండలతో ఆ వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలోనూ ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ కొందరు అనుచరుల సహకారంతో ఈ ‘గోల్‌మాల్’ యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని చర్చ జరుగుతోంది.
కోటి రూపాయల రికార్డులు మాయం?
గడిచిన కొన్నేళ్లుగా మండల మహిళా సమాఖ్య ఆడిట్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తప్పుడు లెక్కలు బయటపడతాయనే భయంతో సుమారు కోటి రూపాయల విలువైన ఖాతా పుస్తకాలను పథకం ప్రకారం మాయం చేసినట్లు సమాచారం. మహిళా లీడర్ల సంతకాలను ఫోర్జరీ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను సొంత ఖాతాలకు మళ్లించుకోవడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు సిబ్బందితో కుమ్మక్కై నకిలీ ఆడిట్ రిపోర్టులు, ఫోర్జరీ స్టాంపులను సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.
పథకం ఏదైనా అధ్యక్షురాలిదే ఆధిపత్యం
మహిళల జీవనోపాధి కోసం మంజూరైన సుమారు రెండు కోట్ల రూపాయల నిధుల్లో అధ్యక్షురాలు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఐఎఫ్ నిధుల కింద అధ్యక్షురాలు లక్ష రూపాయలు, అకౌంటెంట్ రెండు లక్షలు తీసుకుని ఎవరికీ తెలియకుండా లోలోపలే అప్పులు మాఫీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మహిళా శక్తి క్యాంటీన్ పేరుతో మంజూరైన రెండు లక్షల రూపాయలను తీర్మానం లేకుండానే వాడుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో క్యాంటీన్ జాడ లేదని తెలుస్తోంది. లక్ష్మాపూర్, ఉప్పునుంతల తదితర గ్రామాల్లో జీవనోపాధి రుణాల మంజూరు కోసం ఒక్కో మహిళ వద్ద ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు.
అడ్డంగా దొరికినా ఆగని లావాదేవీలు
అధ్యక్షురాలి అక్రమాలపై ఆమె స్వగ్రామమైన తుర్కపల్లిలోనే నిరసన వ్యక్తమైంది. బినామీ పేర్లతో నిధులు డ్రా చేయడంతో ఆమెను గ్రామ సంఘం పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. జనవరి 9న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మహిళా సంఘాల లీడర్లు లెక్కలు నిలదీయగా, అధ్యక్షురాలు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆగ్రహించిన సభ్యులు రికార్డులను స్వాధీనం చేసుకుని కోశాధికారికి అప్పగించారు. అయినప్పటికీ, ఉన్నతాధికారుల ఒత్తిడితో మళ్లీ తప్పుడు లావాదేవీలు చేసేందుకు కొత్తపల్లి, మాధవానిపల్లి గ్రామాలకు నిధులు మళ్లించేలా చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అధికారుల మౌనంపై అనుమానాలు
ఈ భారీ అవినీతి వ్యవహారంపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు వచ్చే ఆడిటర్లను సైతం రాజకీయ నేతలతో బెదిరించి వెనక్కి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షురాలు, అకౌంటెంట్ ఆగడాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. కాగా, ఈ అంశంపై ఏపీఎం సబితాదేవిని వివరణ కోరగా.. తాను బాధ్యతలు చేపట్టకముందు జరిగిన విషయాలు తెలియవని, ప్రస్తుతం ఎలాంటి అక్రమాలు జరగడం లేదని పేర్కొన్నారు.






