ఇప్పుడు కాకపోతే.. పాలమూరు ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Ratna Kumari |

ఇప్పుడు కాకపోతే.. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను ఎప్పటికీ పూర్తి చేసుకోలేమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఇప్పుడు కాకపోతే.. పాలమూరు ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు :  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఇప్పుడు కాకపోతే.. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను ఎప్పటికీ పూర్తి చేసుకోలేమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4, 5 తేదీలలో ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం. తరతరాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కాల్సిన‌ నీటి వాటా దక్కలేదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాను అని గొప్పలు చెప్పాడు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి ఇక్కడే కుర్చీ వేసుకొని మూడు సంవత్సరాల లో పూర్తి చేస్తానని కేసీఆర్ చెప్పాడు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయి అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఆ మోసాలను గ్రహించిన ప్రజలు కేసీఆర్ కు కుర్చీ లేకుండా చేశారని మంత్రి చెప్పారు.


కేసీఆర్ వెళ్తూ.. వెళ్తూ మన చేతికి చిప్ప ఇచ్చిపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార‌థ్యంలో పరిస్థితులను చక్కదిద్దుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు . ఇందులో భాగంగానే ఈనెల 4 5 తేదీలలో ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు అని చెప్పారు. నాలుగున సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ వస్తారు . అక్కడ నారాయణపేట.. కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి.. కృష్ణానదిపై బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని మంత్రి జూపల్లి చెప్పారు. అనంతరం రాత్రి సోమశిల కు చేరుకొని అక్కడ అధికారులతో ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజు ఐదవ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న రిజర్వాయర్లను పరిశీలిస్తారు.. అదేరోజు సాయంత్రం జడ్చర్లలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని.. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటిస్తారని మంత్రి వెల్లడించారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసుకోకుంటే ఇంకెప్పుడు పూర్తి చేసుకోమని చెప్పారు. ముఖ్యమంత్రి పాల్గొని బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. జన సమీకరణను భారీ ఎత్తున నిర్వహించాలని నాయకులకు, పార్టీ శ్రేణులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

భారీ ఎత్తున జన సమీకరణ : ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్నం

జడ్చర్ల లో ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడానికి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి అని ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మన ముఖ్యమంత్రి మన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృత నిత్యంతో ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా రెండు రోజుల పాటు ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించేందుకు వస్తుండడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నుండి కనీసం 15 వేల నుంచి 20వేల జనాన్ని తరలించాలని సూచించారు . రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బేకరీ అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story