సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం పైనే ఉద్య‌మ‌కారుల ఆశ‌లు

by Ratna Kumari |

ఆనాడు భార్యాపిల్లలను వదిలి, ఆకలిదప్పులతో, రాత్రింబవళ్లు లాఠీ దెబ్బలు తింటూ, జైలు పాలై ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నాం. మా ఆశలు అడియాశలు అయ్యాయి. అప్పటి ఉద్యమం యాది చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు ఉద్య‌మ‌కారులు.

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం పైనే ఉద్య‌మ‌కారుల ఆశ‌లు
X

దిశ, అలంపూర్ : ​"ఆనాడు భార్యాపిల్లలను వదిలి, ఆకలిదప్పులతో, రాత్రింబవళ్లు లాఠీ దెబ్బలు తింటూ, జైలు పాలై ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నాం. మా ఆశలు అడియాశలు అయ్యాయి. అప్పటి ఉద్యమం యాది చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. అప్పటి సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను ఎలాగో ఆదుకోలేదని.. జీవిత కాలం మొత్తం జెండాలను మోస్తూ తెలంగాణ కోసం ఉద్యమించి పూర్తిగా నష్టపోయి రోడ్డున పడ్డామని వాపోయారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2వ తేదీన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం" అని గుమ్మగోవర్ధన్, భూషణం భావోద్వేగంగా పేర్కొన్నారు.

మానవపాడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతు పోరాటం చేసిన ఉద్యమకారులు మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి ఉద్యమకారునికి గుర్తించి 250 గజాల నివాస స్థలం కేటాయించాలని, బస్సు, రైలు ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, జాతీయ పండుగల వేడుకల్లో ఉద్యమకారులకు అధికారికంగా గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం గద్వాల జిల్లా కార్యదర్శి దుబ్బన్న, మండల అధ్యక్షుడు శంకర్ నాయుడు, ఉపాధ్యక్షుడు వివేకానంద, ప్రధాన కార్యదర్శి రఘు పాల్గొన్నారు.

Next Story