- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.

దిశ, జడ్చర్ల : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ - ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్త తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆసుపత్రి జనరల్ వార్డులో మాప్‌తో స్వయంగా ఆయన శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన ప్రజలకు కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన మంత్రికి పోలీసులు గౌరవ వందనం అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో ప్రధానంగా 10 ముఖ్య అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలిపారు. ఆ అంశాలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు ముందుగా అవగాహన కల్పించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కొన్నేళ్లుగా మరుగునపడిన సమస్యలకు ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు ఒక ప్రక్షాళన కార్యక్రమమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అరైవ్-అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని ఆయన హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించాలని సూచించారు. రహదారులపై బ్లాక్ స్పాట్‌లను గుర్తించి స్పీడ్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీహరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.






