నేరాల సంఖ్య గణనీయంగా తగ్గేలా పనిచేయండి

by velandi.Saikiran |

పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్

నేరాల సంఖ్య గణనీయంగా తగ్గేలా పనిచేయండి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్ల లోని నేరాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్రైమ్ కేసులు దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, యాక్సిడెంట్స్, మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసపూరిత చర్యల వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. క్రైమ్ కు సంబంధించిన అన్ని వివరాలను కంప్యూటరైజ్డ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్(సీసీటిఎన్ఎస్) లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, దర్యాప్తు నాణ్యత మెరుగుపరచి న్యాయ స్థానాల్లో దోషాలకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలు సేకరించాలని ఎస్పీ ఆదేశించారు.

ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పహారా విధులు, నైట్ మొబైల్ పెట్రోలింగ్ ను మరింత బలోపేతం చేయాలని, సీసీ కెమెరాల వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించి నేరాలను అరికట్టి పోలీస్ ఇమేజ్ ను మెరుగుపరచే విధంగా పౌరసేవ కార్యక్రమాలను కొనసాగించాలని ఎస్పీ జానకి సూచించారు. అలాగే అందరు డిఎస్పీ లు, సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పెండింగ్ వారెంట్లు, ఫోక్స్ కేసులు, ఆర్థిక నేరాలు, ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి వారాంతపు ఫలితాలను సమీక్షకు సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్, రూరల్ సిఐ గాంధీనాయక్, ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాసులు, మగ్ధూమ్ అలీ, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, భూత్పూర్ సీఐ రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి, ఎస్సైలు, ఐటి సెల్ ఇంచార్జీ రాఘవేందర్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story