దేవరకద్రలో రైల్వే గేటు ఓపెన్ చేయాలని ధర్నా..

by Disha Web Desk 11 |
దేవరకద్రలో  రైల్వే గేటు ఓపెన్ చేయాలని ధర్నా..
X

దిశ, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రైల్వే గేటు తెరవాలని ధర్నా చేశారు. రైల్వే గేట్ మూసేయడం, ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ రెండు వైపులా లేకపోవడంతో ఆర్ఓబీ పైకి ఎక్కి దిగే క్రమంలో చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఏ వాహనం ఎటువైపు వెళ్లాలో, ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ దేవరకద్ర మండల కేంద్రంలోని రైల్వే గేట్ ను మూసివేయడంతో దేవరకద్రను రెండు భాగాలుగా చేసినట్లు అయిందని అన్నారు.


ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి పశువుల సంత, పాఠశాలకు సైతం వెళ్లాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి ద్వారా వెళ్లాల్సి వస్తుందని ఫ్లైఓవర్ కి రెండువైపులా సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని బస్టాండ్ లోకి వెళ్లకుండా రోడ్డు పైనే ప్రయాణికులను దించి వెళ్తున్నారని, చుట్టుపక్కన గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సైతం నిత్యం అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. దేవరకద్రలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని అన్నారు. రైల్వే గేటు వెంటనే తెరవాలని ,ప్లై ఓవర్ కి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని, మా సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అక్కడికి చేరుకున్న సీఐ రజిత రెడ్డి వారితో మాట్లాడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొండ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ రాందాస్, కొండ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కృష్ణంరాజు చలమారెడ్డి, కర్ణకార్ గౌడ్, గుద్దేటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed