ప్రాణాలు తీస్తున్న.. ఈత సరదాలు

by Dishanational2 |
ప్రాణాలు తీస్తున్న.. ఈత సరదాలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఈత సరదాలు.. ప్రాణాలు తీస్తున్నాయి.. ఎండలు మండిపోవడంతో సేదతీరడానికి ఈత కోసం వెళ్తూ కానరాని లోకాలకు తరలుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు మండలాలలో ఉన్న చెరువులు.. కుంటలు.. చెక్ డ్యాములలో పెద్దలు, పిల్లలు అనే తేడాలు లేకుండా ఈత కొట్టడానికి వెళుతున్నారు. మరి కొంతమంది బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.. కొద్దిపాటి నిర్లక్ష్యం.. అలసత్వం కారణంగా ప్రాణాలు నీటిలో కలిపి వేసుకుంటూ వారి వారి కుటుంబాలలో విషాదాలు మిగిలిస్తున్నారు.

ఈత వచ్చి కొందరు.. ఈత రాక మరికొందరు

ఈత రాని వారే కాదు.. వచ్చిన వాళ్లు కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తమ పిల్లలకు గాని, ఇతరులకు గాని ఈత నేర్పే క్రమంలో జాగ్రత్తలు పాటించకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల.. ఈత నేర్చుకునే వారు నేర్పే వారి గొంతును బిక్కిరిగా పట్టుకోవడం తదితర కారణాలవల్ల అటు నేర్చుకునే వారు.. ఇటు నేర్పేవారు ప్రాణాలను కోల్పోతున్నారు. మరి కొంతమంది ఈత రాకపోయినా.. చెరువులు.. కుంటలు.. చెక్ డ్యాములు తక్కువ లోతు ఉన్నాయి అనుకొని లోపలికి వెళుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం బారిన ఒక్కరూ పడిన మిగిలిన వారు వారిని కాపాడబోయి ప్రాణాలు వదులుతున్నారు.

కనిపించని సూచికలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల వద్ద తగిన సూచికలను అధికారులు గానీ, ఆయా గ్రామాల సర్పంచులు గాని ఏర్పాటు చేయడం లేదు. ఆయా జిల్లాల ఎస్పీలు, అధికారులు ఎన్నిసార్లు చెప్పినా నీటి వనరుల వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలువురు ప్రత్యేకించి పిల్లలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత బాగా వచ్చిన తమ పెద్దవారితో కలిసి కాకుండా పలువురు చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఈతకు వెళుతున్నారు. ఈత నేర్చుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు కూడా లేకుండా నేర్చుకుంటూ మునిగిపోతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు:

-మార్చ్ నెలలో అలంపూర్ వద్ద తుంగభద్ర నదిని ఈదుతూ దాటే క్రమంలో ఓ గొర్రెల కాపరి నీటి ప్రవాహానికి కొట్టుకోపోయి ప్రాణాలు వదిలాడు.

-ఏప్రిల్‌లో నారాయణపేట మండలం బోయిన్పల్లి గ్రామంలో ఈతకు వెళ్లి నీట మునుగుతున్న క్రమంలో కాపాడడానికి వెళ్లిన మహిళతో సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు.

-ఏప్రిల్ నెలలోనే జూరాల ఎడమ కాలువ వద్ద తమ కుటుంబాలతో సరదాగా గడపడానికి వెళ్లి ఈత రాక నీటిలో కొట్టుకుపోయి తోడల్లుళ్లు ఇద్దరు మృత్యువు పాలయ్యారు.

-మే నెలలో గద్వాల జిల్లా కేంద్రంలో బావిలో ఈతకు వెళ్లి ఒక బాలుడు మృతి చెందాడు

ఒకేరోజు ఆరుగురు..

నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకుండా గ్రామ సమీపంలో సోమవారం ఈతకు వెళ్లి ముగ్గురు బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో వీర సముద్రం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు అక్కా చెల్లెల్లు మృత్యువు పాలయ్యారు.

విద్యార్థులు జాగ్రత్త..

వేసవి సెలవులు ఉండడంతో చాలామంది పిల్లలు ఈత నేర్చుకోవడానికి వెళుతున్నారు. తప్పనిసరిగా తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. తల్లిదండ్రులు గాని, ఇతర కుటుంబ సభ్యులు కానీ లేనిపక్షంలో ఈతకు వెళ్లొద్దు. ఈత నేర్చుకునే క్రమంలో జాగ్రత్తలు పెద్దలు తీసుకోవాలి. పిల్లలకు చెప్పాలి.. ప్రతి జలాశయం వద్ద సర్పంచులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

-వెంకటేశ్వర్లు, ఎస్పీ, నారాయణపేట జిల్లా

Next Story

Most Viewed