రేషన్ దుకాణాల ముందు గద్దల్లా వాలుతున్న దళారులు

by Disha Web Desk 11 |
రేషన్ దుకాణాల ముందు గద్దల్లా వాలుతున్న దళారులు
X

దిశ, నాగర్ కర్నూల్: రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేసే బియ్యం కిలో పది రూపాయలు చొప్పున కొంటామని ఆయా రేషన్ దుకాణాల ముందు బియ్యం మాఫియా, మధ్య దళారులు గద్దల్లా వాలిపోయి రేషన్ బియ్యం తీసుకున్న జనాలను ఇబ్బంది పెడుతున్నారు. మరి కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారుల వద్ద ఓటీపీ లేదా వేలిముద్రలు వేయించుకొని నేరుగా దళారులకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తూ డీలర్లకు దళారులకు పరోక్ష వెన్నుదన్నుగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి సోకిన అనంతరం నిరుపేదలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితిని గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఇందులో కొంతమంది లబ్ధిదారులు ఆర్థికంగా ఉన్నవారు రేషన్ బియ్యం తినేందుకు ఇష్టం లేక ఇతరులకు అమ్ముకుంటున్నారు. అట్టి బియ్యం మాఫియా చేతికి అందించేందుకు కొంతమంది మధ్య దళారీలు దుకాణాల ద్వారా కొన్ని గోదాంలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవే బియ్యాన్ని తిరిగి రైస్ మిల్లులకు సరఫరా చేసి మళ్లీ ప్రభుత్వానికే రీసైకిలింగ్ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కాగా దళారులు దుకాణాల వద్ద నుంచి ఏకంగా రేషన్ దుకాణాల వద్దకే వెళ్లి రేషన్ తీసుకున్న లబ్ధిదారుల నుంచి బియ్యం కావాలంటూ కిలో పది రూపాయలు ఇచ్చి కొత్త దందాకు తెరలేపుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.


Next Story

Most Viewed