నారాయ‌ణ‌పేట పీఠంపై బీజేపీ కన్ను

by Ratna Kumari |

నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవీ దక్కించుకొని కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ పావులు కదుపుతుంది.

నారాయ‌ణ‌పేట పీఠంపై బీజేపీ కన్ను
X

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవీ దక్కించుకొని కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ పావులు కదుపుతుంది. నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు ఇప్పటివరకు ఏ ఒక్క వార్డు కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అధికార పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను బీజేపీ ఖరారు చేయనున్నట్టు సమాచారం. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ 24 వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులను గెలుపు గుర్రాల కోసం పలుమార్లు సర్వేలు నిర్వహించిన చివరి దశలో కూడా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బీజేపీ ఆశావాహులు అధినాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఒక్క అభ్యర్థి కూడా హామీ ఇవ్వలేదు. పట్టణంలో బీజేపీకి ప్రతి వార్డులోనూ నిర్మాణపరమైనటువంటి ఓట్లు ఉండడంతో రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. మున్సిపల్ చైర్మన్ కోసం పలువురు పోటీ పడుతుండడంతో గతంలో మాదిరిగా అన్ని పార్టీల కంటే ముందు చైర్ పర్సన్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధినాయకత్వం భావిస్తుంది. ప్రతి వార్డు నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కౌన్సిలర్ అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నీ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థికి పోటీగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ సతీమణిని బరిలో దింపే ఆలోచనలో అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నారాయణపేట పీఠాన్ని కైవసం చేసుకుని కాషాయ జెండాను ఎగరవేయాలని బీజేపీ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Next Story