- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం : కలెక్టర్
మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, వంగూర్ : మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల స్థితిగతులను శాఖల వారీగా సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులు, డ్రైనేజీ నిర్మాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి తదితర కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎటువంటి జాప్యం చోటు చేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ పనులన్నీ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షించాల ని, నాసిరకం పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వవద్దని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రతి అధికారి బాధ్యతా యుతంగా వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, గడువులోపు పూర్తి కాని పనులపై సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారిస్తామని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొండారెడ్డిపల్లిని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కే.వి.ఎన్ రెడ్డి, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఈవో రమేష్ కుమార్, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తహశీల్దార్ మురళీమోహన్, ఎంపీడీవో బ్రహ్మచారి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి, ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరి, ప్రజా ప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






