9 ఏళ్లలో బలమైన అడుగులు వేశాం..టీ.పద్మారావు గౌడ్..

by Disha Web Desk 20 |
9 ఏళ్లలో బలమైన అడుగులు వేశాం..టీ.పద్మారావు గౌడ్..
X

దిశ, గద్వాల : తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించుకున్నామని ఉప - సభాపతి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్ల రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తొమ్మిదేళ్లలో సమస్యల వలయం నుండి బయటపడి రాష్ట్ర అభివృద్ధి కోసం బలమైన అడుగులు వేయగలిగామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు రైతులకు ఎకరాకు రూ. 4000 వేల చొప్పున రెండు పంటలకు రూ.8000 రూపాయలు అందిస్తున్న ఘనత ఒక్కతెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 1 లక్ష 60వేల 799 మంది పట్టాదారులకు రూ. 1.942 కోట్ల 61 లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. 2,572 మంది రైతులు మరణించగా రైతు బీమా ద్వారా రూ. 128 కోట్ల 60 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేశామని తెలిపారు. గద్వాల మండలం గుంటిపల్లి పెద్దవాగు దగ్గర చెక్ డ్యామ్, బసల చెరువు దగ్గర దయ్యాలవాగు పై మరో చెక్ డ్యామ్ ను నిర్మిస్తున్నామని ఇందుకు రూ.3.49 కోట్ల రూపాయలు అనుమతితో చేపట్టామని తెలిపారు. నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టి రైతులకు సాగునీరు అందించేందుకు రూ 487.3 కోట్ల పనులకు టెండర్లు పూర్తిచేశామని చెప్పారు. జిల్లాలో నర్సింగ్ కాలేజ్ కోసం రూ. 26 కోట్ల 18 లక్షలు చేపట్టామని తెలిపారు. అల్లంపూర్ లో 21 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, ఐజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 70 లక్షల అంచనాతో 30 పడకల ఆసుపత్రిగా మార్చామని తెలిపారు.

గద్వాల పట్టణ ప్రజల సౌకర్యార్థం రూ 12 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా కేంద్రంలో రూ.38 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో సమీకృత జిల్లా పోలీస్ కార్యాల సముదాయాన్ని నిర్మించామని, త్వరలో ప్రారంభం కాబోతుందని తెలిపారు. జిల్లా సర్వతో ముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్ధులయ్యారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, బండారి భాస్కర్, శ్రీధర్ గౌడ్, జంబురామన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed