తహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు..

by Disha Web Desk 20 |
తహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు..
X

దిశ , చారగొండ/జడ్చర్ల : నాగర్ కర్నూల్ జిల్లా చార గొండ తహసీల్దార్ కార్యాలయం పై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి తాసిల్దార్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా, సంకటోని పల్లికి చెందిన తాళ్ల రవీందర్ మాతృభూమి డెవలపర్స్ సంస్థలు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. చారకొండ మండలం శేరిఅప్పారెడ్డి పల్లి గ్రామ సమీపంలో ఈ సంస్థ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. 12 మందికి విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లను తయారుచేసి వివరాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక్కొక్క డాక్యుమెంటేషన్ కు 25 రూపాయల చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదటి విడతలు నలుగురికి సంబంధించిన డాక్యుమెంటేషన్ల రిజిస్ట్రేషన్లు చేశారు.

డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాతనే మిగతావి రిజిస్ట్రేషన్ చేస్తామని తహసిల్దార్ చెప్పడంతో రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారము రవీందర్ 75 వేల రూపాయలను తీసుకెళ్లి తహసిల్దార్ ను కలిశాడు. డబ్బులను వీఆర్వో భర్త వెంకటయ్యకు ఇవ్వాలని చెప్పడంతో రవీందర్ వెళ్లి అతనికి ఇచ్చాడు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. దీనితో అధికారులు తహసీల్దార్ నాగమణి, వీఆర్వో భర్త వెంకటయ్య, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ రాజును అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏసీబీ అధికారులు నేరుగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఉన్న తహసీల్దార్ నాగమణి ఇంటికి చేరుకొని రాత్రి పొద్దు పోయే దాకా సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంటేషన్లు, పరిమితికి మించిన నగదు, సొమ్ము ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు శనివారం వెల్లడించే అవకాశం ఉంది.


Next Story

Most Viewed