మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ దేనికీ పనికిరాదు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ భవిష్యత్తులో అమ్మకానికి కూడా పనికిరాదని సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి వేదిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ దేనికీ పనికిరాదు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ భవిష్యత్తులో ఎందుకూ పనికిరాదని, దానిని ఎవరూ కొనబోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తాము ఆ అపార్ట్‌మెంట్ కావాలని అడగలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాళ్లకు సమస్య ఉందని చెబుతున్నా కొందరు వినిపించుకోవడం లేదు. గాంధీ సరోవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 98 ఎకరాల డిఫెన్స్ భూమిని ఇస్తోంది. టూరిజం శాఖ వద్ద మరో 100 ఎకరాల భూమి ఉంది. మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఇబ్బంది లేదు’ అని క్లారిటీ ఇచ్చారు.

అయితే, 2005-06లో ఆ అపార్ట్‌మెంట్‌కు అనుమతులు పొందినప్పుడు దానిని ఒక చిన్న నాలా కింద చూపించి, కేవలం 9 మీటర్ల బఫర్ జోన్‌తో పర్మిషన్ తెచ్చుకున్నారని సీఎం గుర్తు చేశారు. కానీ 2012, 2016 నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిమితి 50 మీటర్లకు చేరడంతో అది ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంగా మారిపోయిందన్నారు. ‘50 మీటర్ల నిబంధన ప్రకారం మార్క్ చేస్తే.. నేడు సగం అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లోనే ఉంది. రేపు భవిష్యత్తులో ఆ ఫ్లాట్లను అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వాళ్లకు ఇష్టమైతే, ఆ భూమిని ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం అప్పగిస్తే.. నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story