ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూమ్‌లో మాధవీలత పూజలు.. సోషల్ మీడియాలో దుమారం!

by Ramesh Naini |

తెలంగాణ బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత మరోసారి వార్తల్లో నిలిచారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూమ్‌లో మాధవీలత పూజలు.. సోషల్ మీడియాలో దుమారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మహిళా ప్రార్థనా మందిరం (ప్రేయర్ రూమ్)లో ఆమె ‘దుర్గా సూక్తం’ పఠించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. నిన్న (సోమవారం) మాధవీలత తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూమ్‌లో కింద కూర్చుని చేతులు జోడించి దుర్గా సూక్తం పఠిస్తున్నారు. అదే సమయంలో ఆ గదిలో కొందరు ముస్లిం మహిళలు కూడా ప్రేయర్ చేస్తున్నట్లు ఉన్నారు. ‘లోక కల్యాణం కోసమే తాను ప్రార్థనలు చేశానని, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందంటూ’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. వీడియో తీసిన వ్యక్తి ఆమె కదలికలను రికార్డు చేసినట్లు స్పష్టమవుతోంది.

గదిలో కెమెరాతో వెళ్లి గట్టిగా మంత్రాలు

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిశ్శబ్దంగా ప్రార్థనలు చేసుకోవాల్సిన గదిలో కెమెరాతో వెళ్లి గట్టిగా మంత్రాలు చదవడం నిబంధనలకు విరుద్ధమని, ఉద్దేశపూర్వకంగానే ముస్లిం మహిళలను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టేందుకే ఆమె ఇలా చేశారని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనిపై పౌరవిమానయాన శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాధవీలతకు మద్దతుగా మరికొందరు నిలుస్తున్నారు. ప్రార్థనా మందిరాలు అన్ని మతాల వారికీ చెందినవని, కేవలం నమాజ్ కోసమే కాదని, హిందూ మంత్రాలు చదివితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

గతంలో చెలరేగిన వివాదాలు ఇవే..

2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసిన మాధవీలత.. శ్రీరామనవమి ర్యాలీలో మసీదు వైపు బాణం వేస్తున్నట్లు సైగ చేయడం, పోలింగ్ బూత్ వద్ద ముస్లిం మహిళల బురఖాలు తీయించి ఐడీ కార్డులు చెక్ చేశారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే.

Next Story