డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు? బీఆర్ఎస్ అలర్ట్

by Disha Web Desk 4 |
డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు?  బీఆర్ఎస్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. లోక్‌సభను రద్దుచేసి డిసెంబర్‌లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ముందుస్తుకు వెళ్తున్నదని, ఆ విషయం బీఆర్ఎస్‌కు లీకైనట్టు సమాచారం. దీంతో అలర్ట్ అయిన గులాబీ బాస్ అసెంబ్లీతో కలిపి లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా? అనే లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని, ఊహించిన దానికి భిన్నంగా అక్కడి తీర్పు రావడంతో ఆ ప్రభావం ఎక్కడి వరకు వెళ్తుందోనని బీజేపీలో టెన్షన్ మొదలైందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్. అందుకే కేంద్రం ముందుస్తు ఆలోచన చేస్తున్నదని, కర్ణాటల ఫలితాల ఎఫెక్ట్ డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడితే కమలం పార్టీకి నష్టం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం దాని ఎఫెక్ట్ ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

అందులో భాగంగానే తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను సైతం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నది.

బీఆర్ఎస్‌లో గుబులు

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే బీఆర్ఎస్‌కు తీవ్రనష్టం కలుగుతుందని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రజల్లో మోడీ పట్ల ఆదరణ ఉందని, జమిలి ఎన్నికలు జరిగితే అటు లోకసభ, ఇటు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్‌కు తగ్గుతాయనే అంచనాలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటే బీఆర్ఎస్ సీట్లు సగానికి తగ్గే ప్రమాదం ఉన్నదనే గుబులు గులాబీ లీడర్లను వెంటాడుతున్నది. దీనితో పాటు జాతీయంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు బ్రేకులు పడతాయనే టెన్షన్ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. జమిలి ఎన్నికలు జరిగితే కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యే చాన్స్ ఉంది.

రామ మందిరం ప్రారంభం కాకుండానే?

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టింది. వచ్చే ఏడాది ఆ టెంపుల్ భక్తులకు అందుబాటులోకి రానుంది. షెడ్యూలు ప్రకారం అయితే రామ మందిరం ప్రారంభించిన తర్వాతే లోకసభ ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా ముందస్తుగానే లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం అడుగులు వేస్తే రామ మందిరం ప్రారంభానికి ముందే ఎన్నికలు జరుగుతాయి. కాని మోడీ రామ మందిరం ప్రారంభించకుండా లోకసభ ఎన్నికలకు వెళ్లే చాన్స్ తక్కువనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed