తెలంగాణ మంత్రులకు BIG టాస్క్.. అందులో ఫెయిల్‌ అయితే పదవి ఊస్ట్!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-16 02:28:17  IST  )

రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఇన్ చార్జి మంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ మంత్రులకు BIG టాస్క్.. అందులో ఫెయిల్‌ అయితే పదవి ఊస్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఇన్ చార్జి మంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో గెలుపోటముల బాధ్యత వారిదేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకున్న తర్వాత.. కొన్ని జిల్లాల ఇన్ చార్జి మంత్రులను తప్పించారు. ఆయాచోట్ల ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. ఇంకొందరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేశారని టాక్. ఈ నేపథ్యంలో ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపే పార్టీ లోటుపాట్లను సరిదిద్దాలని, నాయకుల మధ్య సమన్వయానికి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఇన్ చార్జి మంత్రులకు అధిష్టానం సూచించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా ఇన్ చార్జి మంత్రులకు సవాల్ గా మారిందనే చెప్పాలి.

సమన్వయం పెద్ద చాలెంజ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని ఇన్ చార్జి మంత్రులకు హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉన్న జిల్లాల్లో ఇన్ చార్జి మంత్రులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సూచించినట్లు సమాచారం. చాలా జిల్లాల్లో కొత్త, పాత లీడర్ల మధ్య సమన్వయం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్న లీడర్ల పట్ల స్థానిక ఎమ్మెల్యేలు వివక్ష చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ అభ్యర్థులు గెలువడం అంత సులువైన విషయం కాదు. అందుకని ఇప్పటి నుంచే కొత్త, పాత లీడర్ల మధ్య కోఆర్డినేషన్ కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఇన్ చార్జి మంత్రులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, ఎన్నికల వనరుల సమీకరణ వరకు కీలక పాత్ర వహించే విధంగా ప్లానింగ్ చేసుకోవాలని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

ఫలితాలే గీటురాయి

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేయడంతో పాటు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను భర్తీచేయాలని హైకమాండ్ భావిస్తున్నది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే.. సదరు మంత్రులను తప్పించి, కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని, సీనియర్ మంత్రులను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. జులై మొదటివారంలో మంత్రులతో పార్టీ ఇన్ చార్జి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ విజయం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశానిర్దేశం చేయడంతోపాటు నెగెటివ్ రిజల్ట్స్ వస్తే మంత్రులపై ఎలాంటి చర్యలు ఉంటాయో సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉండే లీడర్లు పేర్కొన్నారు.

Next Story