పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు ఏకగ్రీవం.. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు: సీతక్క

by Ramesh Naini |

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును ఏకగ్రీవంగా తెలంగాణ శాసనమండలి ఆమోదించింది.

పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు ఏకగ్రీవం.. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు: సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ (Panchayat Raj Amendment Bill) పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును ఏకగ్రీవంగా తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క (Minister Seethakka) సమాధానం ఇచ్చారు. ఈ బిల్లుపై చాలా మంది సభ్యులు విలువైన సూచనలు చేశారని, ఈ బిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించారని, ఆ చట్టాన్ని 1/70 గా పిలుస్తారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 చట్టం కృషి చేస్తుందని వెల్లడించారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించారని అన్నారు. ఆ చట్టం అమలులో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. మాకు మున్సిపాలిటీ కావాలని ఎన్నో గ్రామల ప్రజలు అడుగుతున్నారని అన్నారు. మున్సిపాలిటీలు అయితే డెవలప్ అయితామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రం అయినా.. మున్సిపాలిటీ చేయలేదని, కానీ ఇప్పుడు మనం ములుగును మున్సిపాలిటీగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మున్సిపాలిటీలుగా అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. చాలా మండలాల్లోని గ్రామాలను ఇతర జిల్లాల్లో కలిపారని, స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నో గందరగోళాలు తలెత్తుతున్నాయని అన్నారు.

కొన్ని గ్రామాలు ఒక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాయని, రెవెన్యూ పరిధి వేరే మండలంలో ఉంటుందన్నారు. ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని అడుగుతున్నారు.. క్యాబినెట్, సీఎంతో చర్చిస్తామని స్పష్టం చేశారు. కొత్త గ్రామపంచాయతీలలో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు సభ్యులు ప్రస్తావించారని, వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మన ఆమోదించుకున్నామని, కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని, అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.

Next Story