- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాటాలు చేస్తూనే ఉన్నాం.. మీకు కనిపించకపోతే తప్పు మాదా?
ఖమ్మంలో కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించిన తీరును రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించిన తీరును రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సీఎం విజయన్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎంపీ కిరణ్‌కు సీపీఐ(ఎం) తెలంగాణ కార్యదర్శి జాన్‌వెస్లీ(CPIM Telangana, John Wesley) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ లబ్ధి అనడం సరైంది కాదు..
‘ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు 10 సంవత్సరాలుగా భూదాన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో, బుల్డోజర్‌లతో బలవంతంగా కుటుంబాలను బయటకు పంపించి ఇండ్లను కూల్చేశారు. ఇప్పటికీ బాధితులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతోందని ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ ఇదంతా అవాస్తవమని, కేరళ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు అనడం సరైంది కాదు అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
పోరాటాలు చేస్తూనే ఉన్నాం..
వాస్తవంగా వెలుగుమట్లలో ఎంత విధ్వంసం జరిగిందో, బాధితులు ఎంత ఇబ్బంది పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. శిబిరాల్లో ఉన్నవారికి కనీస సౌకర్యాలు కూడా లేవనే విషయం మీడియాల్లో వస్తూనే ఉంది. అక్కడకి వెళ్ళిన మీడియా ప్రతినిధుల కూడా అరెస్టు చేసి, నిర్భంధిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఇది కాంగ్రెస్ ఎంపీకి కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఇప్పటికైనా అక్కడున్నటువంటి పేదలకు అక్కడే ఇండ్లు నిర్మించి, స్థిర నివాసం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి అవాస్తవాలను మాట్లాడి ప్రజలను మభ్యపెట్టదలచుకుంటే తప్పకుండా ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెపుతారు’ సీపీఐ(ఎం) కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.






