లీడర్లు జర భద్రం.. కంగారు పెట్టిస్తున్న ‘అన్ అఫీషియల్ నోట్’!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కీలక అనుచరులు, బంధువులు.. తెరవెనుక సాగించే కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాపెట్టాయి.

లీడర్లు జర భద్రం.. కంగారు పెట్టిస్తున్న ‘అన్ అఫీషియల్ నోట్’!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కీలక అనుచరులు, బంధువులు.. తెరవెనుక సాగించే కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాపెట్టాయి. కొందరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గుర్తించినట్టు తెలిసింది. ఈ మేరకు ఒక ‘అన్ అఫీషియల్ నోట్’ను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తిస్థాయి నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిసింది. ఇందులో కొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా..

చట్టసభలకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి కీలక అనుచరులు, బంధువుల కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాయి. వాటికి సంబంధించిన సమగ్ర వివరాలతో ‘అన్ అఫీషియల్ నోట్’ ను సిద్ధం చేశాయి. ఏ అంశంలో ఎక్కడ, ఏ విధంగా అధికార దుర్వినియోగం జరిగిందో, దాని వల్ల జరిగిన అవినీతి, పక్షపాతంగా ఎలా వ్యవహరిస్తున్నారో నివేదికలో పూర్తి వివరాలు చేర్చినట్టు సమాచారం. అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన వారిలో కొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా, సర్కారుకు చెడ్డపేరు తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని, వారి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే ప్రమాదముందని గుర్తించినట్లు తెలిసింది.

ప్రజాప్రతినిధుల పేరుతో..

కొందరు ప్రజాప్రతినిధుల కీలక అనుచరులు, బంధువులు.. ఆయా నాయకుల పేర్లతో ఎక్కువగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయాన్ని సమకూర్చే శాఖలకు సంబంధించిన కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని రిపోర్టులో పొందుపర్చినట్లు సమాచారం. అయితే చట్టసభల ప్రజాప్రతినిధులు నేరుగా జోక్యం చేసుకోకుండా బంధువర్గం, ముఖ్య అనుచరుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిసింది. ఇందులో రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా.. పనులు జరగడానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తేల్చినట్లు సమాచారం. ఇలాంటి కార్యకలాపాలపై గతంలో కొందరిని హెచ్చరించినా.. తీరు మార్చుకోకపోవడంతో వారి పేర్లను సైతం నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల బంధువులు, వారి అనుచరుల ఆగడాలతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే ప్రమాదముందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని అంచనా వేసినట్లు సమాచారం. ఇలాంటి అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన ఈ నివేదికను త్వరలో నిఘావర్గాలు ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక తర్వాత అయినా వారిలో మార్పు వస్తుందేమోనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story