ల్యాండ్ వ్యాల్యూ@రూ.10 వేల కోట్లు.. తెలంగాణలో 540 ఎకరాల భూ స్కాం!

by Disha Web Desk 4 |
ల్యాండ్ వ్యాల్యూ@రూ.10 వేల కోట్లు.. తెలంగాణలో 540 ఎకరాల భూ స్కాం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా బిలాదాఖలా భూములు అదృశ్యమవుతున్నాయి. రెండు గ్రామాలు, రెండు మండలాలు, రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉండి.. సర్వేకు నోచుకోని ఈ భూములు ప్రభుత్వానివే. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంషాబాద్, కందుకూరు, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో ఉన్న అలాంటి ల్యాండ్స్‌పై పెద్దోళ్ల కండ్లు పడ్డాయి. ఏదో ఒక సర్వే నంబరు తగిలించి హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాము ఏనాడో కొనుగోలు చేశామంటూ కొందరు పట్టాదారు పాసు పుస్తకాలు పొందుతున్నారు. సేల్ డీడ్స్, మ్యుటేషన్, నాలా కన్వర్షన్.. లే అవుట్లు.. ఇలా చకచకా పనులు పూర్తి చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కోర్టు కేసులు, అనేక వివాదాలు తలెత్తిన భూముల్లోనూ కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో బిలాదాఖలాను పట్టాగా క్లాసిఫికేషన్ చేయించుకుంటున్నారు. 2014 నుంచి పదేండ్ల కాలంలో ఇలాంటి వందల ఎకరాలను పట్టాగా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గండిపేట మండలంలో..

గతేడాది ఆగస్టు నుంచి నవంబరు నెలల్లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌లోనూ బిలాదాఖలా భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్న భూమిలో కొంత విస్తీర్ణానికి(కొందరికి) క్లియరెన్స్ ఇచ్చారు. అందుకే గతేడాది వరకు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నప్పటికీ తాజాగా అవి పట్టా భూములుగా దర్శనమిస్తున్నాయి. అదే సర్వే నంబరులో మిగతా వారిని పట్టాదారుగా పేర్కొంటూనే నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్‌లో ప్రభుత్వ భూమి అన్నారు.

ఎవరి ఆదేశాల మేరకు అత్యంత ఖరీదైన భూమికి క్లియరెన్స్ ఇచ్చారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎకరం రూ.100 కోట్లు పలికే భూములకు అత్యంత సమీపంలోని ఈ ల్యాండ్ పార్శిళ్లపై అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయిలో ఉండే సమస్యకు పరిష్కారం ఎలా లభించింది? ఎవరి ప్రోత్సాహంతో క్లియర్ చేశారో సమగ్ర దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

77 ఏండ్లుగా నో ట్రాన్సక్షన్

గండిపేట మండలం ఖానాపూర్ సర్వే నం.65లో 1947 నుంచి ఎలాంటి క్రయ విక్రయాలు చోటు చేసుకోలేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చెప్తున్నది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేస్తే నిల్‌గా వస్తున్నది. 77 ఏండ్లుగా ఆ సర్వే నంబరులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఎవరూ అమ్మలేదు. కొనలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లెయిమ్స్ ఎలా వచ్చాయన్నది ప్రశ్న? ఈ సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం 547.27 ఎకరాలు ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ఎలాంటి లావాదేవీలు లేకపోయినప్పటికీ సబ్ డివిజన్లుగా పహానీలు రాశారు. చాలా సబ్ డివిజన్లలోని విస్తీర్ణం ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. కానీ కొన్ని సబ్ డివిజన్లలో పట్టాదారులుగా ప్రైవేటు వ్యక్తుల పేర్లను చేర్చారు.

కొందరికేమో ఈ పాసు బుక్ జారీ చేసినట్లుగా ట్రాన్సక్షన్ స్టేటస్‌లో చూపిస్తున్నారు. ధరణి పోర్టల్ రాకముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే లావాదేవీలు జరిగాయి. మరి అలాంటివేమీ లేనప్పుడు ల్యాండ్స్ క్లెయిమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అంతుచిక్కడం లేదు. సాదాబైనామాతోనే కొనుగోళ్లు నడిచాయా? అది విద్యావంతులు, సంపన్నవర్గాలు చేశాయా? ఈ విడ్డూరంపై అనుమానాలు తతెత్తుతున్నాయి. ఖానాపూర్‌కి చెందిన గ్రామస్తులైతే అనాదిగా సాగు చేసుకుంటున్న వారైతే.. సాదాబైనామాల కింద కొనుగోళ్లు చేసి ఉండొచ్చు. కానీ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులుగా కొనసాగుతున్న వారంతా ఆ గ్రామానికి సంబంధించిన వారే కాదని సమాచారం. అలాంటప్పుడు ఎవరి నుంచి ఎప్పుడు, ఎలా కొన్నారు? రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కారు? ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలు తెలుస్తాయని రిటైర్డ్ అధికారులు సూచిస్తున్నారు.

రిసార్టులకు పట్టాలు

– కొన్ని రిసార్టులకు కూడా ఈ బిలా దాఖలా భూమిలో నుంచి పట్టాలు జారీ చేశారు. అందులో పట్టాదారు పేరు డి.ప్రతాప్ చంద్రారెడ్డి, తండ్రి పేరు జంగ్లీ రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ గా నమోదు చేశారు. పైగా జెండర్ దగ్గర ఫిమేల్ అని పేర్కొన్నారు. ఏకంగా 11.20 ఎకరాలు పట్టాగా నమోదు చేశారు.

– టీకే ప్రతాప్ కాంబ్లే, తండ్రి లేట్ డా ఎస్టీ కాంబ్లే పేరిట ఏకంగా 23 ఎకరాలు పట్టా ఇచ్చారు. ఐతే ల్యాండ్ స్టేటస్ లో నాట్ సైన్డ్/ ఆధార్ ఇన్ కరెక్ట్ అని పెట్టారు. ట్రాన్సాక్షన్ స్టేటస్ లో సర్వే నంబర్/సబ్ డివిజన్ లో మ్యుటేషన్/సక్సెషన్/నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనుమానాలకు దారి తీస్తున్నది.

– కె.విష్ణువర్ధన్ రెడ్డి పేరిట 6.20 ఎకరాలు, డా.ఎం. నాగేశ్వర్ పేరిట 2 ఎకరాలు నమోదు చేశారు. వీళ్లకు పాసు బుక్ జారీ చేశారు. ఎకరం మార్కెట్ విలువ రూ.3.15 కోట్లుగా ఉంది.

– ఆలియా ఖాద్రి పేరిట 4.12 ఎకరాలు, నవీద్ ఆలం ఖాద్రీ పేరిట 4.10 ఎకరాలు, పట్టా చేశారు. కానీ పీవోబీలో నమోదు చేశారు.

– వేమూరి రమేశ్ బాబు, తండ్రి గోపాలరావు పేరిట 20 ఎకరాలు, వేమూరి విమలాదేవి పేరిట 12 ఎకరాలు ఉంది. అయితే ఇది ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్ పెండింగ్ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. వేమూరి శ్రీహరి తండ్రి రమేశ్ బాబు పేరిట 7 ఎకరాలు ఉంది. నేచర్ ఆఫ్ ల్యాండ్ లో మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ గా పేర్కొన్నారు.

150 ఎకరాలకు క్లెయిమ్స్

గండిపేటను ఆనుకుని ఉన్న ఖానాపూర్‌లోని 540 ఎకరాల ప్రధాన భూమిపై కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు భూమి పార్శిల్‌లో కొంత భాగాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. సర్వే చేయని భూమిగా బిలాదాఖలాగా ఉందని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి బహిరంగ మార్కెట్లో రూ.10 వేల కోట్లు పలుకుతుంది. ల్యాండ్ పార్శిల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దానికి ఏ సర్వే నంబర్ లేదు. దీన్ని బిలాదాఖలా భూమిగా పిలుస్తారు. అంటే ఉస్మాన్‌సాగర్ విస్తరణకు అనుగుణంగా ఒక ఎక్స్‌ ప్రెస్ ఉద్దేశ్యంతో సర్వే చేయకుండా వదిలివేయబడిన భూమి.

ఈ ప్రాంతం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీల్) పరిధిలోకి వస్తుంది. ఈ భూమిపై ఉస్మాన్ సాగర్ ఉన్నది. ఏ ప్రైవేటు పార్టీలకు పట్టా ఇవ్వలేదు. ఈ భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని గతంలో అధికారులు చెప్పారు. ఇప్పుడేమో సర్వే నం.65 ని చూపిస్తూ 540 ఎకరాల్లో 150 ఎకరాలకు పైగా కొన్ని ప్రైవేటు పార్టీలు క్లెయిమ్ చేస్తున్నాయి. వీరు సమర్పించే డాక్యుమెంట్లు ఎన్ని నిజమో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నిజానికి ఆ భూమికి ఆనుకొని ఉన్న ఐదెకరాల్లో ఒక పట్టాదారు ఉన్నారు. అతనికి 1954 సర్వేలో గుర్తించారు. ఆ సర్వే నంబరులో కేవలం 5 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ 150 ఎకరాలకు పైగా క్లెయిమ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 2001 లో రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.


Next Story