మనం కొనే మటన్.. ఎంత వరకు సేఫ్?.. ఇటీవల వెలుగుచూసిన ఘటనలు చూస్తే లైఫ్‌లో నాన్‌వెజ్ ముట్టరు!

by Gantepaka Srikanth |

మటన్‌, చికెన్‌ అమ్మకాలపై అధికారుల నిఘా కొరవడింది. దీంతో కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

మనం కొనే మటన్.. ఎంత వరకు సేఫ్?.. ఇటీవల వెలుగుచూసిన ఘటనలు చూస్తే లైఫ్‌లో నాన్‌వెజ్ ముట్టరు!
X

మటన్‌, చికెన్‌ అమ్మకాలపై అధికారుల నిఘా కొరవడింది. దీంతో కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కుళ్లిన, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్ర పరిసరాల్లో విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాట మాడుతున్నారు. పలు కారణాలతో చనిపోయిన పొట్టేళ్లు, కోడి మాంసాన్ని కూడా కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. తాజా మాంసంలో నిల్వ ఉన్న మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మరికొందరు తూనికల్లో మోసాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. అయితే వాటి అమ్మకాలపై ముస్తాబాద్ లో అధికారుల తనిఖీలు కరువయ్యాయి. దీంతో ప్రజలకు తాజా మాంసం లభ్యం కావడం లేదు. మండలంలో చాలా చోట్ల నాణ్యత లేని మటన్ ను ధర పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మాంసప్రియులు కోరుతున్నారు.

దిశ, ముస్తాబాద్: చాలా మందికి నాన్‌వెజ్ తినటమంటే ఇష్టం. కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లకు వెళ్లి నాన్‌వెజ్ కొని తెచ్చుకుంటారు. ఇష్టంగా వండించుకొని కడుపునిండా ఆరగిస్తారు. అయితే మనం కొనే మటన్.. ఎంత వరకు సేఫ్..? ఈ విషయం గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఇటీవల వెలుగుచూసిన ఘటనలు నాన్‌వెజ్ తినాలంటేనే వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి.

మటన్ కొనాలంటే వణుకుతున్న ప్రజలు

మటన్ దుకాణాల్లో మటన్ ,చికెన్ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే మండల కేంద్రంలో కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నారనే కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. అలాంటివి తినే ముందు జాగ్రత్తగా ఉండక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.

చనిపోయిన కోళ్లు ,అనారోగ్య మేకలు వారి టార్గెట్

మండలంలోని చుట్టు పక్కల ఎక్కడైనా మేకలు కానీ గొర్రెలు కానీ అనారోగ్యం బారిన పడి, రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్న వాటిని అతి తక్కువ రేట్లకు విక్రయించి రహస్యంగా కోసి ఎప్పటిలాగే మార్కెట్లో ప్రజలని నమ్మబలికి కేజీ రూ.800ల నుంచి 900ల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాజా కోళ్ళతో పాటు చచ్చిన కోళ్లను కూడా తెల్లారేసరికి కోసి చికెన్ ని ప్రజలకు విక్రయిస్తున్నారు. పలు మార్లు అధికారులు హెచ్చరించి నోటీసులు ఇచ్చిన కూడా మాంసం విక్రేతలకు పట్టనట్లు ప్రతి నిత్యం ఇదే తంతు కొనసాగుతుంది.

డ్రైనేజీల పక్కనే మాంసం షాపుల నిర్వహణ జరుగుతుండటంతో అపరిశుభ్రత మధ్య మాంసం కొనుగోలు చేయడం వలన విక్రయదారులు రోగాల బారిన పడక తప్పదని వైద్యులు చెప్తున్నారు.

ప్రత్యేకమైన స్థలంలోనే మాంసం అమ్మకాలు చేపట్టాలి

రోడ్ల పక్కన షాపులు ఉండే సరికి షాపుల వద్ద మాంసం కోసం జనాలు గుమిగుడేసరికి రోడ్ల పై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మాంసం దుకాణాలను ప్రత్యేక స్థలంలో నిర్వహించాలి. డ్రైనేజీల వద్ద అపరిశుభ్రత వలన మాంసం కొనడానికి ఇబ్బందిగా ఉంది. మాంసం దుకాణాలను ప్రత్యేక స్థలంలో ఏర్పరిచి మాంసం విక్రయాలను జరిపితే బాగుంటుంది. -సద్ది మధుసూదన్ రెడ్డి, ముస్తాబాద్ గ్రామస్తుడు

నాణ్యమైన మాంసాన్ని మాత్రేమే అందించాలి

మాంసం విక్రేతలు ఎవ్వరైనా సరే మేక, గొర్రె ను కోసే ముందు ఆరోగ్యంగా ఉందా లేదా అని మా సమక్షంలో పరీక్షలు చేస్తాం. పరీక్షలు చేసిన అనంతరం స్టాంప్ ఉన్న మేకను మాత్రమే కోసి నాణ్యమైన మటన్ ను ప్రజలకు అందించాలి. లేని యెడల తగు చర్యలకు బాధ్యులవుతారు. = డా.నిఖిల, పశు వైద్యురాలు.

Next Story