- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు. కానీ, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని, నా తండ్రిని మీరు తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా? కేసీఆర్‌ను రోజూ తిడుతూనే ఉన్నారు. ఒకరోజు చనిపోవాలనుకుంటారు. ఒకరోజు కాలు విరిగింది అంటారు. ఇంకోరోజు ఇంకేదో అంటారు. మీ భాష చూస్తుంటే దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకుని కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నాం. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినట్టు ఉంది నేటి పరిస్థితి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతల చేరికల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేకనే రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మొన్న కేసీఆర్ ఏమడిగారు? ఏమయ్యా.. పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పండపెట్టినవు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వెనక్కి పంపినా, దానిని మళ్లీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ సీఎంకు ఉన్నదా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తాయి. ఆ పనిచేయమని అడిగారు’ అని వెల్లడించారు. అలా కేసీఆర్ అడగడం తప్పా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేక రేవంత్‌రెడ్డి పిచ్చి మొరుగుడు మొరుగుతున్నారని ధ్వజమెత్తారు.
పెయింటింగ్స్ ఏసేటోడు సీఎం అయిండు
రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునే రేవంత్‌రెడ్డి.. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. జీవితంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావడం తప్పు కాదని.. కానీ అది మంచి పనులతో రావాలని.. లంగ పనులు, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, జైలుకు వెళ్లి రావడం గొప్ప విషయం అన్నట్టు ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పైసలు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నారని.. ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి పైసలు పంపిస్తూ పదవి కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటే హుందాతనంగా ఉండాలని.. ఇదా సీఎం వాడే భాష? అని నిలదీశారు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రజలు అడిగితే ‘గుడ్లు పీకి గోటీలాడతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అని సమాధానం చెప్పడంపై మండిపడ్డారు. ముసలోళ్లు వచ్చి రూ.4,000 పెన్షన్ అడిగితే పేగులు తీస్తానని, విద్యార్థులు ఉద్యోగాల గురించి అడిగితే ‘లాగుల తోండలు విడిపిస్తా’ అని బెదిరించడం ఏ రకమైన సంస్కారమని నిలదీశారు. ‘నీ అమ్మ, నీ అయ్య.. గీదా నీకు నేర్పిన భాష? రెండేళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం తిట్లు తిట్టడం తప్ప నీకు ఏమీ రాదు’ అని కేటీఆర్ విమర్శించారు. కుర్చీకి ఇచ్చే గౌరవంతోనే ఊరుకుంటున్నామని.. తాను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడినేనని.. తిట్టడం మొదలుపెడితే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లిషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి తనకు కూడా ఉన్నదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి పిచ్చి రోజురోజుకూ ముదురుతున్నదని, ఆయన భార్య గీతమ్మ ఆయన్ని వెంటనే కట్టేయాలని, లేకపోతే ఎవరినైనా కరిచినా కరుస్తారని అన్నారు.
అంధ్రా అల్లుడిని తెచ్చుకున్న భీమవరం బుల్లోడు
ఏమన్నా అంటే తనకు అహంకారం అంటారని, కానీ అసలైన అహంకారం రేవంత్‌రెడ్డిదా లేక తనదా అని ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. తన విద్యాభ్యాసంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ‘నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్‌రెడ్డికి ఎందుకు నొప్పి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. ఆ సమయంలో నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పునే, అమెరికా.. ఇలా ప్రపంచమంతా చదువుకున్నాను’ అని స్పష్టం చేశారు. రేవంత్ మాదిరిగా తాను చదువు సంధ్య లేకుండా తిరగలేదని, రేవంత్‌కు వారి అమ్మయ్య చక్కటి తోవ చూపించకపోతే తానేం చేయాలని ఎద్దేవా చేశారు. తనకు ఇంగ్లిష్, హిందీ రావడం చూసి రేవంత్ ఎందుకు ఏడుస్తున్నారని, సత్తా ఉంటే ఆయన కూడా నేర్చుకోవాలని సూచించారు. నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్, ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకోవడం తప్పు కాదా? అందుకే ఈయనకు ‘భీమవరం బుల్లోడు’ అని పేరు పెడితే సరిపోతుంది’ అని ఎద్దేవా చేశారు. ‘మా నాయన తెలంగాణ తెచ్చిన మొనగాడు. అది నేను గర్వంగా చెప్పుకుంటా. నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు నీ పేరు చెప్పుకుంటారు. కానీ ఇలాంటి లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు’ అని పేర్కొన్నారు. ‘అలాగే.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని కానీయనని శపథాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.






