ఒరిజినల్ గాంధీలు ఒకప్పుడు ఉండేవారు.. ఇప్పుడెవరూ లేరు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను కలిసి పరామర్శించారు.

ఒరిజినల్ గాంధీలు ఒకప్పుడు ఉండేవారు.. ఇప్పుడెవరూ లేరు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టిస్తాం.. ఇది నా బాధ్యత అని భరోసా ఇచ్చారు. అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా? అని ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులను ఇక్కడికి రమ్మనండి అని సవాల్ చేశారు. ఏ తప్పు జరగక పోతే ఆర్డీవోను ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకడిని బలి పశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

60 ఎకరాలపై ముగ్గురు మంత్రుల కన్ను పడింది. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులూ మాయగాళ్లే. ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పట్టాలు సక్రమమే.. కాంగ్రెస్‌ నేతల బుద్ధే వంకర. దేశంలో ఒకప్పుడు ఒరిజినల్ గాంధీలు ఉండేవారు. ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారు. కచ్చితంగా ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులే. పేదల ఉసురు వారికి తప్పకుండా తగులుతుంది అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story