ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Taduka Kalyani |

తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికు కట్టుబానిసలుగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు షాకింగ్ కామెంట్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో/చర్లపల్లి : తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికు కట్టుబానిసలుగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు షాకింగ్ కామెంట్ చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ లోని వీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో కనుక్కోవడం పోలీసుల పనిగా మారిందన్నారు. పోలీసుల మెడకాయ పైన తలకాయ ఉన్న పనే చేస్తున్నారా..?అని నిలదీశారు. పోలీసులు అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బానిసలుగా పనిచేస్తున్న ఒక్కో పోలీసు పేరు రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని లెక్కలు వడ్డీతో సహా కలిపి ఇస్తామని హెచ్చరించారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పై..

తెలంగాణ నీళ్లను ఏపీ తీసుకుపోతేంటే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. బనక చర్ల ప్రాజెక్ట్ అపేదాక తాము పోరాటం చేస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ నీటి వాటా మనకి ఇచ్చిన తర్వాత ఎవరూ ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ కడుతుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. పోస్ట్ కార్డు, ఆన్ లైన్ పిటిషన్ ద్వారా మన డిమాండ్ తెలియ చేద్దామని కేటీఆర్ తెలియజేశారు.

ట్యాపింగ్ కు సీఎం ఒప్పుకున్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లే.. తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నమని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు.అధికారులు ట్యాపింగ్ చేస్తే చేయొచ్చని రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే అధికారుల తప్పా..? అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తే మాత్రం కేసీఆర్, కేటీఆర్ లది ఏలా తప్పు అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. మనకి సోషల్ మీడియా సపోర్ట్ తప్పా ఏ మీడియా సపోర్ట్ లేదని కేటీఆర్ చెప్పారు. సోషల్ మీడియాలో మన తడఖా చూపించాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు.

నీళ్ల కోసం మరో ఉద్యమం.. హరీష్ రావు

తెలంగాణ ఉద్యమ గుర్తులు, చరిత్రను చెరిపేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఏనాడు అనలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ,చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ద్వజమెత్తారు. నీళ్లు నిండుగా ఉంటే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించారని చంద్రాబాబును హరీష్ రావు నిలదీశారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలోనే కేటాయించిన నీళ్లనే అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. గోదావరి నీళ్ల లెక్క తేలకుండా.. వాటా తేల్చకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు కడితే తెలంగాణ ఊరుకోదని, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా .. నీళ్ల కోసం మరో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందన్నారు. గురు శిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్రలను అడ్డుకుంటామన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ తరపున సుప్రీం కోర్టును అశ్రయిస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

తెలంగాణ అంటే సీఎంకు ద్వేషం.. దేశపతి

సీఎం రేవంత్ రెడ్డి కి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బల్కా సుమన్, బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్,ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story