తెలంగాణ కథలో మెయిన్ విలన్ ఆ పార్టీనే: కేటీఆర్

by Gantepaka Srikanth |

‘పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.

తెలంగాణ కథలో మెయిన్ విలన్ ఆ పార్టీనే: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం దీక్షా దివస్‌ను మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, 2009 నుంచి 2023 పాలన వరకు చేసిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ ప్రాణం ముఖ్యమైనదని.. దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలకు గుర్తుచేస్తున్నానని అన్నారు. తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయన్నారు. తెలంగాణ కథలో ముమ్మాటికీ కాంగ్రెస్ విలన్ అని, శాశ్వత శత్రువు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే అని స్పష్టం చేశారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదన్నది సత్యం అని.. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి, అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

దమ్ముంటే పది మంతి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..

తమను అవమానపరిస్తే ఊరుకుంటాం కానీ.. తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ అన్నారు. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా తామే హీరోలని ఫోజులు కొడతారని.. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివాస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం తమదని.. సీఎం రేవంత్‌రెడ్డి మాదిరి ఏనాడూ తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని తాము అనలేదన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ప్రతిసారీ తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ ప్రజాప్రతినిధులను పార్టీలో కలుపుకొని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనే అని.. దమ్ముంటే చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాల కోసం, ప్రజల కోసం నిలబడిన వీరులని.. 60 ఏళ్ల పాటు బానిసలుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే అని తెలిపారు. తల్లి తెలంగాణను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలే అని.. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతామని చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసివేశారని.. దీక్షా దివాస్ సందర్భంగా మరోసారి తెలంగాణ తల్లిని తిరిగి సచివాలయంలో పునః ప్రతిష్ట చేసేందుకు ప్రతిజ్ఞ పూనాలని అన్నారు.

దీక్షా దివస్‌కు పునరంకితం అవుదాం

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల పోరాటపటిమను గుర్తుచేసుకొని మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, అమరుల ప్రాణాలు తీసుకున్న తీరుని, తెలంగాణకు నిరంతరం చేస్తున్న ద్రోహాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. స్వతంత్ర సంగ్రామ పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నాయని.. అదే తీరుగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలోనూ అపూర్వమైన ఘట్టాలు ఉన్నాయని అన్నారు. చరిత్రను మలుపు తిప్పిన సమున్నత సందర్భాలలో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకటి అని నవంబర్ 29, 2009వ సంవత్సరం ఉద్యమ చరిత్రలో ఒక ఉజ్వల దృశ్యంగా నిలిచిపోతుందన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా’ అంటూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన నినాదం సమరనాదంగా పనిచేసి మొత్తం తెలంగాణ జాతిని ఏకం చేసిందని, 11 రోజుల పోరాటంతో తెలంగాణలో పోరాటం పోటెత్తిందన్నారు.

కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కలిసి వచ్చి తెలంగాణ కావాలని కొట్లాడారన్నారు. కేసీఆర్ దీక్షకు దిగివచ్చి డిసెంబర్ 9 తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వచ్చిందన్నారు. ఉద్యమంలో పట్టువిడుపులతో ముందుకు సాగిన కేసీఆర్ చాణక్యం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, ఇందులో భాగంగా ఎన్నో పదవి త్యాగాలు, ఎన్నో రాజీనామాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల కోసం బానిస లెక్క పెదవులు మూసుకుని తెలంగాణకు విద్రోహం చేశారని తెలిపారు. దీక్షా దివస్ అంటే కేవలం కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని, దీక్షా దివస్‌ని ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ పండుగలో ఉన్న స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ పండగలు చేసుకున్నట్లుగానే, దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ సోయికి సాన పెట్టుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాలని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మాట, మౌనం రెండూ సంచలనమే అని, రెండేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ మాట లేకుండా రాజకీయం నడవడం లేదని, అంతటి బలమైన ముద్ర కేసీఆర్‌దని అన్నారు. మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ తెలంగాణను కాపాడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ తదితర నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్

మరోవైపు.. దీక్షా దివస్‌ను గుర్తుచేస్తూ రాష్ట్రవ్యాప్తంగానూ కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీమంత్రి, పార్టీ సీనియర్ లీడర్ హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలిభిషేకం చేశారు. కరీంనగర్‌లోనూ శాతవాహన యూనివర్సిటీ వద్ద దీక్షా దివస్ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లోనూ దీక్షా దివస్ సందర్భంగా సమావేశాలు నిర్వహించారు.ల

Next Story