- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఒక్క దానికి సమాధానం చెప్పు.. అసదుద్దీన్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న..
ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి ప్రజలను ప్రలోభ పెడుతున్నారని.. అవినీతి సొమ్మను అడ్డగోలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి ప్రజలను ప్రలోభ పెడుతున్నారని.. అవినీతి సొమ్మను అడ్డగోలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. ఓడిపోతామని తెలిసి ఓటు కోసం కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బుల గురించి నిలదీయాలని చెప్పారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్‌కు అసలు మూడేళ్లు రేవంత్‌రెడ్డి ఈ పదవిలో ఉంటారో.. లేక మూడు నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి పనితీరు చూసి.. ఢిల్లీలో వాళ్ల అధిష్టానం కూడా కత్తులు నూరుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల తరఫున బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు.
ఇంత చిల్లర సీఎంను చూడలేదు..
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. రేవంత్‌రెడ్డి అంత చిల్లరగా వ్యవహరించిన నాయకుడిని చూడలేదని కేటీఆర్ మండిపడ్డారు. పెన్షన్ పెంచాలని అడిగినా.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసినా బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థులు దాకా ప్రతి వర్గానికి మొండిచేయి చూపిస్తున్న రేవంత్‌రెడ్డి కొత్తగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తుందంటే మాత్రం ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అబద్ధాలను గుర్తుకు తెచ్చుకోవాలి
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో ప్రజలు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని కేటీఆర్ కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు బకాయిలు చెల్లించకుండా వారిని మనోవేదనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి.. పేదల ఇల్లు కూలగొడుతున్నారని ఫైరయ్యారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే పేదల ఇళ్లపైకి బుల్డోజర్ దండెత్తుతున్నదని మండిపడ్డారు. రెండేళ్లలోనే వేలాది ఇళ్లను నేలమట్టం చేసి పేదలను రోడ్డుపైకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూలగొట్టే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు కత్తి తమ చేతికి ఇస్తే బుల్డోజర్‌కు అడ్డంగా వెళ్లి పేదలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. గతంలో సినిమా వాళ్లను జైల్లో పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఎన్నికల కోసం అదే సినిమా వాళ్లతో బలవంతంగా సన్మానం చేయించుకున్నారని చెప్పారు. సినీ కార్మికులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులను సైతం ఈ సర్కార్ ఎంతో ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. పోలీస్ కుటుంబాలనే కొట్టించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపుతామని రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నారని.. ఎవడబ్బ సొమ్మని పథకాలు ఆపుతారని నిలదీశారు. కొందరు ఆకు రౌడీలు ఓటు వేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి సంగతి కూడా తేలుస్తామని హెచ్చరించారు. గెలవకముందే బెదిరింపులకు దిగుతున్న ఈ కాంగ్రెస్ లీడర్లు.. పొరపాటున గెలిస్తే ఎన్ని అరాచకాలకు పాల్పడతారో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్‌గూడ డివిజన్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.






