- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌ను కాపాడుకోవాలి: కేటీఆర్ పిలుపు
తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని అన్నారు. సీఎంకు బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం, అవినీతి సొమ్ము కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని అన్నారు. అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తున్నదని విమర్శించారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని అన్నారు. తాను చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానంటూ సీఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉన్నదని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






