కూకటివేళ్లతో పెకులుతున్నాయి: KTR

by Gantepaka Srikanth |

కూకటివేళ్లతో పెకులుతున్నాయి: KTR

కూకటివేళ్లతో పెకులుతున్నాయి: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని తెలిపారు.

పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్‌రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని పేర్కొన్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లెపల్లెనా అధికార పార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని వెల్లడించారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు. గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని.. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా బంగారు బాటలు వేస్తుందని హామీ ఇచ్చారు.

Next Story