KTR: ఆ మంత్రుల పేర్లు చెప్పండి! మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ రిక్వెస్ట్ ట్వీట్

by Ramesh Naini |

వరంగల్ లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

KTR: ఆ మంత్రుల పేర్లు చెప్పండి! మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ రిక్వెస్ట్ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరంగల్ లో గురువారం మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రులు డబ్బులు తీసుకోని ఫైల్స్ పై సంతకం చేస్తారన్న ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకి చాలా అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ "కమీషన్ సర్కార్" నడుస్తోంది. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిన ఓ బహిరంగ రహస్యంగా మారింది. ఈ 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు, వారి సహచర మంత్రుల ప్రకారమే, భారీ కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టరని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపలే ధర్నా చేయడం ద్వారా ఈ ప్రభుత్వం కమిషన్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇలాంటి మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని నేను కొండా సురేఖని కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేదా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీరు నియమించిన సొంత మంత్రి చేసిన ఆరోపణలపై దర్యాప్తు విచారణకు ఆదేశించగలరా?’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని, ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.

Next Story