వాటిపై CM రేవంత్‌కు విపరీతమైన ఆసక్తి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం పరికిపంద చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

వాటిపై CM రేవంత్‌కు విపరీతమైన ఆసక్తి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం పరికిపంద చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్లడం తప్పా అని నిలదీశారు. అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుండి 1,200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని తప్పుపట్టారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పేదల భూములపై పడిందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నదని.. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని.. ఉద్యమ కాలం నుండే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని.. ప్రజల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించారు.

రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: వేముల ప్రశాంత్‌రెడ్డి

పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును మార్గమధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం ఖండించదగిన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. పరిగికి చేరకుండా పోలీసులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా హరీశ్‌రావును అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు.

ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ కత్తి: బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ యాదవ్

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో గ్యారంటీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రశ్నించే గొంతులపై కత్తి కడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. పరిగి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న హరీశ్‌రావును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన నడుపుతున్నదని విరుచుకుపడ్డారు. ఉగ్గుపాలతోనే ఉద్యమాన్ని పునికి పుచ్చుకున్న బీఆర్ఎస్‌కు నిర్బంధాలు కొత్త కాదని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు.. 420 హామీలను ఎగ్గొట్టిన హస్తం పార్టీని అడుగడుగునా వెంటాడుతామని తేల్చిచెప్పారు. ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ అక్రమ బాగోతాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.

Next Story