KTR: సీఎం రేవంత్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఎక్స్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: సీఎం రేవంత్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఎక్స్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పరిపాలన చేతకాక కేవలం రాజకీయ కక్షసాధింపులతో కాలం వెళ్లదీస్తున్న ఈ సీఎం మంజీరా, మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే, సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న (jurala project) జూరాల ప్రాజెక్టుకు, నేడు (Manjeera Project) మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(శుక్రవారం) ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (SDSO) నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరం.. అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్ వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్లు ఎస్డీఎస్ఏ నివేదిక గుర్తించినా సీఎం మొద్దు నిద్ర వీడకపోవడం మరో దుర్మార్గమని విమర్శించారు.

నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం, నేడు ఎస్డీఎస్ఓ నివేదిక అందినప్పటికీ మంజీరా బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టకపోవడం.. ఈ కాంగ్రెస్ సర్కారు దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మాని అటు మేడిగడ్డ బ్యారేజీని, ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. బ్యారేజీల సామర్థ్యానికి మించిన వరద వచ్చిన సందర్భాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేక పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ గుర్తించింది. సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా ఇదే తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపించి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పై బురదజల్లాయని ఆరోపించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే, అప్పటికప్పుడు వాటిని మరమ్మత్తు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్ప కాళేశ్వరంపై కక్ష గట్టినట్టు ఏ ప్రభుత్వాలు గతంలో వ్యవహరించలేదన్నారు.

Next Story