JNTU: జేఎన్టీయూ సిరిసిల్ల విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ ఆందోళన.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి

by Ramesh Naini |   (  Updated:2025-09-06 16:43:01  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

JNTU: జేఎన్టీయూ సిరిసిల్ల విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ ఆందోళన.. ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సిరిసిల్లలోని (JNTU) జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని (State Government) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ హయాంలో ప్రారంభించిన జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డితో పాటు, సాంకేతిక విద్యా కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని, త్వరగా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు. అంతవరకే ప్రస్తుతం నడుస్తున్న తీరుగానే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకొని పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలు చెల్లించేలా చూడాలని కోరారు.

ఈ అంశంలో సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుంటే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 2021లో సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేసింది. దీని కోసం రూ. 402 కోట్లు కేటాయించారు. మొదటి విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 1032 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 700 మందికి హాస్టల్ వసతి కల్పించారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, కాలేజీ కమిషనర్ నుంచి తాత్కాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రానందున, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదులకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశాన్ని తెలుసుకున్న కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.

Next Story