‘ఫార్ములా’ కేసులో కేటీఆరే A1..! ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధం

by Kema Shiva Kumar |

ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతికి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే బాధ్యుడని విచారణలో ఏసీబీ నిర్ధారించినట్టు తెలిసింది.

‘ఫార్ములా’ కేసులో కేటీఆరే A1..! ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతికి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే బాధ్యుడని విచారణలో ఏసీబీ నిర్ధారించినట్టు తెలిసింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1గా పేర్కొనగా.. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇన్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఆదేశాలను తాము పాటించామని దర్యాప్తు సమయంలో ఏ2, ఏ3లు ఏసీబీకి స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. హెచ్ఎండీఏ నుంచి నిధుల చెల్లింపులో కేటీఆర్.. ఏక పక్షంగా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ‘క్విడ్‌ ప్రోకో’ జరిగినట్టు ఏసీబీ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. హెచ్ఎండీఏ నిధులను ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఈఓ) సంస్థకు యూకే పౌండ్ రూపంలో చెల్లింపులు జరిగాయని, ఇది కేటీఆర్ ఒత్తిడి మేరకే జరిగినట్టు ఏసీబీ విచారణలో తేలిందని సమాచారం. క్విడ్ ప్రోకో‌లో భాగంగా ఫార్ములా ఈ కార్ రేస్‌కు స్పాన్సర్స్‌గా వ్యవహరించిన ఎస్ నెక్ట్స్ జెన్, దాని మాతృ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ర్టోరల్ బాండ్ ద్వారా రూ.44 కోట్లు అందినట్టు దర్యాప్తులో బయటపడిందని టాక్. విచారణలో ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులు సైతం కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సంస్థకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. కేసు నివేదికను తాజాగా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు అందజేశారు.

అరెస్టుకు రంగం సిద్ధం?

కేసు దర్యాప్తు దాదాపు 9 నెలలు కొనసాగగా.. నివేదికలో వెల్లడైన విషయాల ప్రకారం కేటీఆర్‌పై చర్యలకు, అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ సీఎస్‌కు నివేదిక పంపారు. నిందితులుగా పేర్కొన్న మాజీ మంత్రి కేటీఆర్ (ఏ1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్(ఏ2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇన్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(ఏ3)ని, సీజన్ 9 స్పాన్సర్స్‌గా వ్యవహరించిన ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థ ప్రతినిధులను, ఫార్ములా రేస్​నిర్వహించిన ఎఫ్ఈఓ సంస్థ సీఈవో‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి కావాలని నివేదికలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పాలసీ మేకర్స్‌గా ఉన్న అధికారులు.. ప్రస్తుతం నిందితులుగా పేర్కొన్నందున వారిపై ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఏసీబీ తన రిపోర్టులో పేర్కొంది.

దానకిషోర్ ఫిర్యాదుతో వెలుగులోకి..

ఫార్ములా ఈ కారు రేసులో రూ.54.88 కోట్ల హెచ్ఎండీఏ నిధులు దారి మళ్లాయని నాటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 19, 2024 లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంలో చార్జ్ షిట్ వేసేందుకు ఏసీబీ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వ్యవహరించిన అరవింద్ కుమార్ అప్రూవల్‌గా మారి దర్యాప్తు సంస్థకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు బహిర్గతమైంది. జూలై 3న రెండోసారి విచారణలోనూ ఫార్ములా ఈ కార్ రేస్‌ నిధుల విషయంలో కర్త, కర్మ, క్రియ కేటీఆరే‌నని చెప్పినట్టు సమాచారం. నాటి మంత్రి ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపినట్లు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇన్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి.. ఏసీబీ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు విడతలుగా రూ.46 కోట్లను ఎఫ్ఈవో సంస్థకు, రూ.8.06 కోట్లను ట్యాక్స్ రూపంలో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు, రూ.కోటి 10 లక్షలను ఫెడరేషన్ మోటార్ క్లబ్‌కు బదిలీ చేశారని, ఇలా మొత్తంగా హెచ్ఎండీఏ నిధులు రూ.54.88 కోట్లు దుర్వినియోగం అయినట్టు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.

Next Story