- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోకాపేటలో కోట్లు పలికిన భూమి.. ఎకరం @రూ.137.25 కోట్లు
హెచ్ఎండీఏకు సంబంధించిన కోకాపేట్ లోని నియోపొలిస్ లేఅవుట్ లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏకు సంబంధించిన కోకాపేట్ లోని నియోపొలిస్ లేఅవుట్ లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ లేఅవుట్ లోని ఆరు ప్లాట్లలో సోమవారం 17, 18వ ప్లాట్లకు వేలం వేశారు. ఈ ఆక్షన్ లో తొలి దశలోనే రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఎకరాకు హెచ్ఎండీఏ రూ.99 కోట్లుగా నిర్ణయించింది. వేలంలో బిల్డర్ల నుంచి తీవ్రంగా పోటీ ఉండడంతో రికార్డు స్థాయిలో ఎకరాకు రూ.137.25 కోట్ల ధర పలికింది. మిగిలిన ప్లాట్లకు సైతం ఇదే తరహాలో ధరలు పలికే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల్లో ఎకరాకు రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
ఎకరాకు రూ.137.25కోట్లు..
కోకాపేట్ లోని నియో పొలిస్ లేఅవుట్ లో 15 నుంచి 20 వరకు ఆరు ప్లాట్లకు ఈ-వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎకరాకు ప్రారంభ ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. అయితే సోమవారం నిర్వహించిన వేలంలో ప్రారంభ ధరను మించి ఎకరాకు రూ.137.25 కోట్లు పలకడంతో రియల్ భూమ్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. 4.59 ఎకరాలకు సంబంధించిన 17వ ప్లాట్ కు ఎకరాకు 136.50 కోట్లు పలికింది. ఈ ప్లాట్ ను వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పీ దక్కించుకోగా, 5.31 ఎకరాలతో కూడిన 18వ ప్లాట్ లో ఎకరాకు రూ.137.25 కోట్ల ధరతో ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ దక్కించుకున్నది. అయితే 2023లో జరిగిన నియోపొలిస్ ఆక్షన్లలో సగటు ధర ఎకరాకు సుమారు రూ.73 కోట్లు మాత్రమే పలికింది. ప్రస్తుత ఫలితాలు భూ విలువల్లో 87శాతం పెరుగుదలతో ఎకరాకు రూ.137.25 కోట్లు పలకడం విశేషం. ఈ ధరలు నియో పొలిస్ లేఅవుట్ పై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి రూ.1,356 కోట్ల ఆదాయం వచ్చింది.
దేశవ్యాప్తంగా గుర్తింపు..
హెచ్ఎండీఏకు సంబంధించిన ప్లాట్ల ఈ-వేలం ఎంఎస్టీసీ పోర్టల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగిన వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ-స్థానిక డెవలపర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. దీంతో హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో హైదరాబాద్ సత్తాను మరోసారి నిరూపించుకుందనే చెప్పాలి.
28న మరో రెండు ప్లాట్లకు..
నియోపొలిస్ లోని ఆరు ప్లాట్లలో రెండు ప్లాట్లకు సోమవారం ఆక్షన్ పూర్తి చేశారు. మరో నాలుగు ప్లాట్లకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈనెల 28న రెండు ప్లాంట్లకు వేలం నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న మిగిలిన రెండు ప్లాట్లకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న కోకాపేట్ లోని గోల్డ్ మైన్ లేఅవుట్ తోపాటు మూసాపేట్ లోని 15ఎకరాల భూములకు సైతం వేలం నిర్వహించనున్నారు. వచ్చే వేలంలోనూ రికార్డు స్థాయిలోనే ధరలు పలికే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.






