- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు వేగవంతం : మంత్రి తుమ్మల
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

- డిసెంబర్ 9 నుంచి సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రూపకల్పనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. సోమవారం కొహెడ మార్కెట్‌కు సంబంధించి సవరించిన లేఅవుట్‌పై మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈప్రాజెక్టును మూ దశలలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ 9న మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌లో కొనసాగుతున్న లావాదేవీలను కొహెడ సమగ్ర మార్కెట్‌కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమన్వయంతో తరలింపు ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని ఓపెన్ ప్లాట్‌ఫారాలు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డులు, విశాల రహదారులు, పారదర్శక లావాదేవీల కోసం సాంకేతిక వసతులు, రైతులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ సమగ్ర మార్కెట్ ద్వారా రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు, మధ్యవర్తుల ప్రభావం తగ్గి, పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిలో మార్కెట్ మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.






