స్థానిక సంస్థలకు రూ.11వేల కోట్లకు పైగా నిధుల విడుదల !

by velandi.Saikiran |

తెలంగాణలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థలకు రూ.11వేల కోట్లకు పైగా నిధుల విడుదల !
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. 2015-16 నుంచి 2019-20లలో కేంద్రం తెలంగాణలో గ్రామపంచాయతీలకు రూ.5,060 కోట్లు విడుదల చేయగా 2020-21 నుంచి 2025-26లలో ఈ కేటాయింపులు 80% (రూ.9,050 కోట్లు) పెరిగాయన్నారు. దీనిలో రూ.6,051 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.

గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇందుకోసం, స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను మొదట్నుంచీ సమయానుగుణంగా విడుదల చేస్తోందన్నారు. ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున కేంద్రం మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నదని కిషన్ రెడ్డి తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఖర్చుపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇటీవలే సబ్‌మిట్ చేశారని, దీనికి తోడు గ్రామపంచాయతీలకు ఎన్నికలు కూడా పూర్తయినందున 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులు రూ.260 కోట్లను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నదని, వీటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వగానే దశల వారిగా మిగిలిన రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల కానున్నాయని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నిధుల వినియోగం కోసం తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాలని, ఈ అకౌంట్ పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ లో నమోదు చేసుకుని యూనిక్ ఏజెన్సీ కోడ్ ను పొందాలని కిషన్ రెడ్డి సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల అకౌంట్లను జప్తుచేసుకుని, ఆ నిధులను ఇతర అవసరాలకోసం దారి మళ్లించింది..దీని కారణంగా చాలా మంది సర్పంచ్‌లు తమ హయాంలో చేసిన పనులకు నిధులు రానందున రాజీనామాలు చేశారు..కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. ఇది చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు సహకరిస్తూ, గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు చొరవతీసుకోవాలని కోరుతున్నట్లుగా కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

Next Story