- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానం అంటే సేవే… 15 ఏళ్లుగా వైఎస్సార్ ఆశయాల బాటలో ఖలీల్ పాషా
నాయకుడు చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన అభిమానమని పాల్వంచకు చెందిన యువనేత ఎస్‌కే ఖలీల్ పాషా తన కార్యాచరణతో నిరూపిస్తున్నారు.

దిశ, పాల్వంచ టౌన్; నాయకుడిపై అభిమానం అంటే సభల్లో నినాదాలు చేయడం, ఫ్లెక్సీలు కట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే కాదని… ఆ నాయకుడు చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన అభిమానమని పాల్వంచకు చెందిన యువనేత ఎస్‌కే ఖలీల్ పాషా తన కార్యాచరణతో నిరూపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల తనకున్న అభిమానాన్ని గత 15 సంవత్సరాలుగా నిరంతర సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ జయంతి, వర్ధంతి వస్తే చాలు ఆయనకు అది రాజకీయ కార్యక్రమం కాదు… సేవా యజ్ఞం. ప్రతి ఏడాది ఎలాంటి విరామం లేకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలు, కూలీలు, వృద్ధులు, నిరాశ్రయులు, ప్రయాణికులు, అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ప్రచారం కోసం కాదు… ప్రజల ఆకలి తీర్చడమే తన ధ్యేయమనే భావనతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు స్థానికంగా విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి. వైఎస్సార్ పాలనలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని విశ్వసించే ఖలీల్ పాషా, అదే సేవా స్ఫూర్తిని తన వంతుగా కొనసాగించాలని సంకల్పించి పదిహేనేళ్లుగా నిరాటంకంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా, రాజకీయ ఆర్భాటాలకు దూరంగా సేవ చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
ఇంటి తలుపులపై వైఎస్సార్ చిత్రాలు
తన అభిమానాన్ని కేవలం మాటల్లో కాకుండా జీవితంలో భాగంగా మార్చుకున్నారు. తన కారు, ద్విచక్ర వాహనాలకు “YSR” అక్షరాలు ఉండేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లను తీసుకోవడంతో పాటు, తన ఇంటి తలుపులపై వైఎస్సార్ చిత్రాలను ఏర్పాటు చేసి ఆ మహానేతపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్రాలతో చేతిపై శాశ్వత టాటూ వేయించుకుని తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. నాయకుల పట్ల తనకున్న గౌరవం, విశ్వాసం, అనుబంధానికి ఈ టాటూను ప్రతీకగా భావిస్తున్నట్లు తెలిపారు. ఖలీల్ పాషా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతున్నారు. తండ్రి–కొడుకులు కలిసి ప్రతి ఏడాది అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా వందలాది మందికి అన్నదానం చేయడం, సమాజ సేవను జీవిత ధ్యేయంగా మార్చుకోవడం, అభిమానాన్ని ఆచరణలో చూపించడం ద్వారా ఎస్‌కే ఖలీల్ పాషా పాల్వంచ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. “నాయకుడిపై ప్రేమ ఉంటే అది ప్రజలకు ఉపయోగపడే సేవ రూపంలో కనిపించాలి” అనే సందేశాన్ని తన కార్యాచరణ ద్వారా చాటి చెబుతున్నారు. సేవకు రాజకీయ రంగు ఉండదని, మానవత్వమే గొప్ప సిద్ధాంతమని విశ్వసిస్తూ ముందుకు సాగుతున్న ఆయన సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.






