ఆ కార్యాలయంలో అధికారికి కుర్చీయే లేదట

by Disha Web Desk 9 |
ఆ కార్యాలయంలో అధికారికి కుర్చీయే లేదట
X

దిశ, వైరా: "మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళండి. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కూర్చోవడానికి కుర్చీ ఉంటుంది. మండల స్థాయి అధికారి అయితే కార్యాలయంలో ఓ గదిలో కూర్చొని తన విధులు నిర్వహిస్తారు. కానీ వైరాలో ఓ అధికారికి మూడేళ్లగా కార్యాలయంలో కూర్చినే లేదంటే మీరు నమ్మగలుగుతారా.... ఇది నిజమండి బాబు.. మూడేళ్ల క్రితం ఆ అధికారి గదిని ఓ ఉన్నతాధికారి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ అధికారికి కార్యాలయంలో గది దేవుడెరుగు కుర్చీ కూడా లేకపోవడంతో తెగిన గాలిపటంలా తిరుగుతున్నారు. ఈ తతంగం జరుగుతుంది ఎక్కడ అనుకుంటున్నారా"... ఖమ్మం జిల్లా వైరా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న టౌన్ ఏఈకు కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీ లేదు.


విద్యుత్ శాఖలో కుర్చీ లేని కహాని ఇది....

వైరాలో 11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమయంలో ఆ సబ్ స్టేషన్ వద్ద నిర్మించిన భవనంలో వైరా ఏఈ కు ఓ గదిని కేటాయించారు. అయితే గత మూడేళ్ల క్రితం వైరాకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం మంజూరు అయింది. వైరాకు ఏడిఈ గా వచ్చిన అధికారి సబ్ స్టేషన్ లో ఉన్న ఏఈ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. దశాబ్దాలుగా ఏఈ ఉండే గదిని అన్ని హంగులతో ఏడిఈ తన కార్యాలయంగా మార్చుకున్నాను. దీంతో ఏఈ కి గది, కుర్చీ లేక తెగిన గాలిపటంలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

తమ పనులపై వచ్చిన విద్యుత్ వినియోగదారులతో ఏఈ సబ్ స్టేషన్ ఆవరణలోని చెట్ల కింద నిలబడి మాట్లాడే దృశ్యాలు నిరంతరం ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తమ పనులపై వచ్చిన వినియోగదారులుతో ఏఈ నిలబడి, వారిని నిలబెట్టి మాట్లాడుతుండటంతో విద్యుత్ శాఖకు తమ పై కనీస గౌరవం లేదని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం నూతనంగా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం మంజూరైనప్పుడు ఆ కార్యాలయం కోసం అద్దె భవనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అద్దె భవనం తీసుకొకుండా ఏడిఈ ఏకంగా ఏఈ గదిలోనే తన కుంపటి పెట్టటం విద్యుత్ శాఖలో వివాదాస్పదంగా మారుతుంది.

రూరల్ ఏఈ కార్యాలయం కోసం భవన నిర్మాణం

"ముందు వచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములకు పదును ఎక్కువ" అన్న చందంగా దశాబ్దాల కాలంగా ఉన్న వైరా ఏఈ కి కనీసం కుర్చీలేకుండానే రూరల్ ఏఈ కార్యాలయం కోసం వైరా సబ్ స్టేషన్ ఆవరణలోనే నూతన భవనం నిర్మించటం విశేషం. గత 5 ఏళ్ల క్రితం వరకు వైరా మండలం మొత్తం వైరా ఏఈ పరిదిలోనే ఉండేది. ఆ తర్వాత మండలాన్ని రెండు భాగాలుగా విభజించి వైరా టౌన్, వైరా రూరల్ ఏఈ లను ఏర్పాటు చేశారు.

రూరల్ ఏరియాకు రెండు ఏళ్ళు గొల్లపూడి గ్రామం లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. అనంతరం రూరల్ ఏఈ మకాంను కూడా వైరాకు మార్చారు. అయితే రూరల్ ఏఈ కోసం గత ఏడాది వైరా సబ్ స్టేషన్ ఆవరణలోనే భవనం నిర్మించారు. కాని వైరా టౌన్ ఏఈ కి కనీసం కుర్చీ లేని స్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టౌన్ ఎఈ కి గదితో పాటు కుర్చీ ఏర్పాటు చేస్తారో.... లేదో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed