Crime News:రూట్ మార్చిన లోన్ యాప్ కేటుగాళ్లు.. సెక్స్ వర్కర్‌గా చిత్రీకరిస్తూ..!

by Disha Web Desk 13 |
Crime News:రూట్ మార్చిన లోన్ యాప్ కేటుగాళ్లు.. సెక్స్ వర్కర్‌గా చిత్రీకరిస్తూ..!
X

దిశ, అశ్వారావుపేట: లోన్ యాప్ కేటుగాళ్లు రూట్ మార్చారు. ఇంతవరకు యాప్ ద్వారా లోన్ తీసుకొని చెల్లించలేక పోయిన వారిని వేధించేవాళ్లు. ఇప్పుడు అసలు లోను తీసుకోకపోయినా మొబైల్‌ను హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. సన్నిహితులు బంధువులకు అభ్యంతరకర మెసేజ్‌లు, ప్రైవేట్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బుల కోసం టార్చర్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి శీమకుర్తి రవికుమార్ మొబైల్‌ను హ్యాక్ చేసిన దుండగులు లోన్ యాప్ పేరిట అభాసుపాలు చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు శీమకుర్తి రవికుమార్ వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.1700 లోన్ తీసుకున్నట్లుగా.. ఏడు రోజుల కాలపరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా అసలు 1700 వడ్డీ 1300 మొత్తం 3000 రూపాయలను శీమకుర్తి రవికుమార్ చెల్లించని పక్షంలో.. షూరిటీ గా ఉన్నారని మీ నుంచి రికవరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. వ్యాపారి రవికుమార్‌ను చోర్, సెక్స్ వర్కర్‌గా చిత్రీకరిస్తూ.. అతని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి వాట్సాప్ మెసేజ్‌లు, ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు.

తీసుకొని లోన్‌కి డబ్బులు చెల్లించలేదంటూ చేస్తున్న ప్రచారానికి సదరు వ్యాపారి కంగుతున్నాడు. దుండగులు చేస్తున్న టార్చర్‌కు మానసిక వేదనకు గురయ్యాడు. సన్నిహితులు సలహా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోన్ యాప్ ఆగడాలకు చెక్ పెట్టేది ఎలా అని ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఇప్పటికైనా సైబర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఆర్థిక నేరాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.


Next Story