షెడ్యూల్ విడుదలతో రంజుగా ఖమ్మం జిల్లా పాలిటిక్స్.. ఇంటింటికీ విపక్ష పార్టీలు

by Dishafeatures2 |
షెడ్యూల్ విడుదలతో రంజుగా ఖమ్మం జిల్లా పాలిటిక్స్..  ఇంటింటికీ విపక్ష పార్టీలు
X

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల తేదీలను ఖరారు చేస్తూ సోమవారం పూర్తి షెడ్యూల్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. షెడ్యూల్ రాకముందు బిజీబిజీగా గడిపిన అధికార పార్టీల నాయకులు.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విపక్ష పార్టీలు సైతం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎవరికివారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపేందుకు సిద్ధం అవుతున్నాయి.

దిశ, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని ప్రకటించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అన్న ప్రజల, నాయకుల సందేహం తీరిపోయింది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికార పార్టీ నాయకులతో పాటు, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలపై గురి పెట్టారు. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తియుక్తులను ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే జిల్లాను చుట్టేసిన అధికార పార్టీ..

అందరికంటే ముందుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఖరారైన ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల మధ్య ఉంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరులో కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిరలో లింగాల కమల్ రాజ్, వైరాలో మదన్‌లాల్, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్లు, ఇల్లెందులో హరిప్రియా, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్ షెడ్యూల్ విడుదల కంటే ముందే అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇటు సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గాన్ని ఓ రౌండ్ చుట్టేశారు. ఇక షెడ్యూల్ విడుదల కావడంతో మరింత స్పీడ్ పెంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

గడపగడపకూ కాంగ్రెస్..

అధికార పార్టీతో సమానంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సైతం గడపగడపకూ కాంగ్రెస్ పేరిట గ్యారెంటీ కార్డుతో ప్రచారం చేపట్టారు. అభ్యర్థులెవన్నదీ ఖరారు కాకపోయినా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఖమ్మం, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, సత్తుపల్లిలో మువ్వా విజయ్ బాబు, కొండూరు సుధాకర్, వైరాలో విజయాబాయి, ఇల్లెందులో కోరం కనకయ్య, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పొదెం వీరయ్యలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈసారి తమ పార్టీకి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను, అక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది.

వేగం పెంచనున్న పార్టీలు..

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు పోటీకి సిద్ధం అవుతున్నాయి. ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ఓసారి నియోజకవర్గాన్ని చుట్టేసిన నాయకులు ఇకముందు మరింత దూకుడును ప్రదర్శించి ఓటర్లకు దగ్గర కావడానికి ఉన్న మార్గాలను వెతుకుతున్నాయి. సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రతీ ఓటరును కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలు తీర్చేందుకు పలు హామీలు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి.

Next Story