ఆయన తప్ప అందరూ జంప్.. తెరవెనుక చక్రం తిప్పుతున్న కీలక నేత

by Anjali |
ఆయన తప్ప అందరూ జంప్.. తెరవెనుక చక్రం తిప్పుతున్న కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయినా బీఆర్ఎస్‌లో నేతల వలసలు ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే సీనియర్ నేతలు కారు దిగిపోవడంతో షాక్‌లో ఉన్న బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మినహా ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం వీరంతా మూకుమ్మడిగా హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ కనుమరుగేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నియోజకవర్గాల్లో 11 స్థానాలు కైవసం చేసుకోగా, భువనగిరి, నల్లగొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల అనంతరం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మరోఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, కో- ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరేందుకు పార్టీ సీనియర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

లోకల్ ఎన్నికల కోసం..

చేరికలపై ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడా నేత ఒకరు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాం­డ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జూన్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనుండటంతో బీఆర్ఎస్ పార్టీని మరింత వీక్ చేసి కాంగ్రెస్ బలాన్ని పెంచే ప్రయత్నాలు సాగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మినహా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story