- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెలుగుమట్లలో చీకట్లు: గూడు చెదిరె.. గుండె పగిలె!
వెలుగుమట్ల ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. భూదాన్ భూముల్లో రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడంతో ఆ ప్రాంతవాసులంతా రోడ్డునపడ్డారు.

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెక్కలు ముక్కలు చేసుకుని పేదలు ఏర్పాటు చేసుకున్న ఇండ్లు కూల్చివేయడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏ ఒక్కరినీ కదిలించినా కష్టపడిన సొమ్మంతా గూడు కోసమే ధారపోశామని, ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎక్కడి వెళ్లాలంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే భూమి, రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ పేరిట లక్షల్లో వసూలు చేశారని, ఇప్పుడు గుడిసెలు కూల్చివేయడంతో డబ్బులు పోయి, భూమి పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న వారు కంటికైనా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఉన్నాయని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.. పదేళ్లుగా ఉంటున్న నివాసాలను కండ్ల ముందే కూలగొట్టారని తల్లడిల్లుతున్నారు. నిలువ నీడ లేకుండా పోవడంతో రోడ్లు, ఆ పరిసర ప్రాంతాల్లోనే పిల్లలతో బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు. పిల్లలు స్కూళ్లకు దూరమవగా, వారి తల్లిదండ్రులు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి కొనుక్కున్న ఇంటి సామాగ్రి ధ్వంసం కావడంతో వాటిని పోగు చేసుకోవడంలో కొందరు నిమగ్నమయ్యారు.
ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన భూదాన్ భూమి బాధితుల గోస అంతా ఇంతా కాదు. పదేళ్ల క్రితం వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. గత ప్రభుత్వంలో వారంతా నిశ్చింతగా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగింపు చేపట్టగా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే భూదాన్ భూమిలో ఉంటున్న ఒక్కొక్కరి వద్ద నుంచి భూమి, రోడ్లు, కరెంట్, డ్రైనేజీల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేశారని వాపోతున్నారు. ఇప్పుడు గుడిసెలు కూల్చివేయడంతో డబ్బులు పోయి, భూమి పోయి రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులు ఇవ్వకుండానే..
భూదాన్ భూమి బాధితుల్లో ఏ ఒక్కరిని అడిగినా ఇండ్లను తొలగిస్తున్నామంటూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని చెబుతున్నారు. స్థానిక నాయకులకు నోటీసులు ఇచ్చారనే ప్రచారం వాస్తవం లేదని అంటున్నారు. వారికి ఇస్తే తమకు చెప్పేవారని, ఏ మీటింగ్ సమాచారమైనా చెప్పే నాయకులు నోటీసుల విషయం ఎందుకు చెప్పరని ప్రశ్నిస్తున్నారు.
స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు..
వెలుగుమట్ల భూదాన్ భూమి ఒక్కసారిగా ఇండ్లు కూల్చడంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లకుండా తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. ఇండ్లు కోల్పోయిన వారు టీటీడీసీ అంబేడ్కర్ భవన్లో బిక్కుబిక్కుమంటూ చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ ఉండిపోయారు. ఇండ్లు కోల్పోయిన కనీసం రెండు వేల మంది రోడ్లపై, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారు.
అరెస్టుల పర్వం
భూదాన్ భూమి బాధితుల పక్షాన ఏ నాయకుడైతే నిలబడితే వారిని వెంటనే అరెస్టులు చేయాలంటూ అధికారులకు ముందస్తుగా ఆదేశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్టే ఉన్నా.. నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేయడం ఏంటని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అరెస్టులతో నిర్బంధిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం వచ్చి భూదాన్ బాధితులకు అండగా నిలిచారు. నాయకులు వచ్చి పోతున్నారు తప్ప ఎటువంటి సాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు.






