అంబేద్కర్ ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Disha Web Desk 9 |
అంబేద్కర్ ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, సత్తుపల్లి : కేసీఆర్ ప్రభుత్వం రియల్టర్లతో కుమ్మక్కై పేదల ఇండ్లను కూల్చేయడం దుర్మార్గమని, అంబేద్కర్ ఆశయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సత్తుపల్లి పట్టణ పరిధి కాకర్లపల్లిలో ప్రభుత్వ అధికారులు కూల్చిన ఇళ్ల స్థలాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. కాకర్లపల్లిల్లోని సర్వే నెం.334 లో ఉన్న ప్రభుత్వ భూమిలో గత 30 ఏళ్ల క్రితం 280 కుటుంబాలు ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నారని తెలిపారు.పేదలు ఇల్లు కట్టుకుంటే కూల్చివేయడం దారుణమన్నారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్టర్లకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.పోలీసుల నిఘా నీడలో ఉద్రిక్తతల నడుమ పేదల ఇళ్లను కూల్చివేసి, ఇంట్లో ఉన్న సామన్లు, ఇతరత్రా సామగ్రిని బయటపడేయడం దారుణమన్నారు. అడ్డుకున్న నివాసితులను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం అన్యాయమన్నారు.

పేదలు ఇండ్లు నిర్మించుకున్న స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసిన ప్రభుత్వ ఉద్యోగి రాయల గిరిబాబు, రాయల నాగాంజనేయులు, వాళ్ళని వదిలేసి పేదలపై అధికారులు జులుం చేయడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల చర్యలతో 280 కుటుంబాలు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ ఓ వైపు ప్రకటిస్తుండగా, అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు హేయమని అన్నారు.

హైదరాబాదులో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం దళితుల ఓట్లను కొల్లగొట్టేందుకు కేసీఆర్ కుట్రపడ్డాడని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ స్థానిక దళిత ఎమ్మెల్యే దళితుల ఇండ్లు కూల్చివేస్తే, పేదల పక్షాన మాట్లాడకపోవడం విచారణకరమన్నారు. వాయు పుత్ర వెంచర్ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ పార్టీ జిల్లా నాయకులు స్థానిక నాయకులు కాకర్లపల్లి భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed