- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రతా దళాల టార్గెట్ హిడ్మా.. మావోయిస్టుల చరిత్ర ఇక అంతమేనా?
‘ఆపరేషన్ కగార్’లో భాగంగా మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు నంబాల కేశవరావు, సుధాకర్, చంద్రన్న, మైలారపు భాస్కర్, బండి ప్రకాష్ లాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

దిశ, భద్రాచలం: ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు నంబాల కేశవరావు, సుధాకర్, చంద్రన్న, మైలారపు భాస్కర్, బండి ప్రకాష్ లాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, 26 భారీ దాడుల్లో వ్యూహకర్తగా వ్యవహరించి, మావోయిస్టు కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడుగా, పీఎల్జీఏ -1 బెటాలియాన్ సారథి మడివి హిడ్మా గురించి భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. అతడి ఆచూకీ కనిపెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వాడుతున్నారు. హిడ్మాను హతం చేస్తే మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందించనట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ ప్రారభించిన నాటి నుంచి భద్రతా బలగాలు హిడ్మానే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అతడినే టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇప్పటి వరకు సైనికులు మృతిచెందిన ప్రతి దాడిలో హిడ్మా వ్యూహకర్త కావడం ప్రధాన కారణం. ముఖ్యంగా 2021 ఏప్రిల్ 3న హిడ్మాను అంతమొందించడమే లక్ష్యంగా 2 వేల మంది బలగాలు ఒకేసారి ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అయితే, ఆ బలగాలపై మావోయిస్టు గెరిల్లా దళం 400 మంది హిడ్మా నాయకత్వంలో ఒకేసారి భద్రతా బలగాలపై మెరుపు దాడి చేయడంతో 33 మంది జవాన్లు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయపడ్డారు. ఆ తర్వాత కూడా బలగాలు నష్టపోయిన 26 దాడులకు కూడా హిడ్మా నాయకత్వం వహించాడు. అందుకే పోలీసులకు మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావును ఎన్‌కౌంటర్ చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే... హిడ్మాను పట్టుకోలేకపోతున్నామనే బాధ వారిని తీవ్రంగా వెంటాడుతుంది.
ఇంకా ఎంతమంది ఉన్నారు?
ఆపరేషన్ కగార్ మొదలైన 18 నెలల కాలంలో అనేక ఎన్కౌంటర్లలో 435 మంది మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 48 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. 1,457 మంది నక్సల్స్ పోలీసుల ముందు లొంగిపోగా.. 1,469 మందిని అరెస్ట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో చాలామంది అగ్ర నేతలే ఉన్నారు. అయినా, మావోయిస్టుల దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశారని, పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని గత కొన్ని రోజులుగా అనేక మందిని హత్య చేశారు. ఈ పరిస్థితిలో అసలు ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉండి ఉంటారనే సందేహం అటు పోలీసుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ కలుగుతోంది. హిడ్మాను పట్టుకుంటే మావోయిస్టుల కథ ముగిసినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. కానీ, మావోయిస్టు పార్టీలో అసలు ఎంతమంది నాయకులు, సభ్యులు, సానుభూతిపరులు ఉన్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సీపీఐ అగ్రనేత నారాయణతో పాటు మరికొందరు నక్సలిజాన్ని అణచివేయలేరని ప్రకటించడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని బలంగా చెబుతుండటం ప్రాధాన్యతను సంతరింకుంది.
హిడ్మా గురించి...
హిడ్మా దక్షిణ సుక్మా పువర్తి గ్రామం, మురియా గిరిజన తెగకు చెందిన వాడు. 10వ తరగతి వరకు చదువుకున్న అతడు 1990 చివరలో పీఎల్జీఏలో చేరాడు. 2013లో దర్బా లోయ, 2010లో దంతెవాడ, 2017లో బేజి, బర్కాపాల్, 2021లో భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో అతడే కీలక సూత్రధారి. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో క్రియాశీలకంగా వ్యవహారిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నాడు.






